Kalki 2898 AD Kamal Haasan AS Makeup Artist :కల్కి 2898 AD సినిమాతో సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గురించి ఒక సీక్రెట్ బయటకొచ్చింది! ఎలాంటి పాత్రలోనైనా అలవోకగా ఒదిగిపోయే కమల్ తన నటనతో పాటు మేకప్, లుక్స్ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. పాత్రలకు తగ్గట్టు లుక్‌లను మారుస్తూ ఆయా గెటప్‌లలో పర్ఫెక్ట్గా సెట్ అయిపోతారు. దానికి కారణం ఆయనలో ఉండే బ్రిలియంట్ యాక్టింగ్ స్కిల్‌తో పాటు మేకప్ విషయంలోనూ ఒక మోస్తారుకు మించి టాలెంట్ ఉండటమే. ఈ స్కిల్‌ను హాలీవుడ్ స్టార్ హీరో, రాంబో సిరీస్ కథా నాయకుడైన సిల్వెస్టర్ స్లాలోన్ కోసం ఉపయోగించారట. అలా తనలోని మేకప్ ఆర్ట్‌ను తన కోసమే కాకుండా ఇతరుల కోసం వాడానని కపిల్ శర్మ షోలో వెల్లడించారు.
దీని గురించి కమల్ మాట్లాడుతూ "నేను హాలీవుడ్ సినిమా టీమ్‌లో సాధారణ ఆర్టిస్ట్‌గా పనిచేశాను. స్లాలోన్ ముఖాన్ని అందంగా తీర్చిదిద్దాను. అప్పటికే ప్రోస్తటిక్ మేకప్ ఎలా వేయాలో నెలన్నార రోజుల పాటు నేర్చుకున్నాను. ఆ షూటింగ్ సమయంలో నన్నెవరూ గుర్తు పట్టేవారు కాదు. షాపుల దగ్గర నిలబడి కూల్ డ్రింక్స్ తాగేవాడ్ని, వీధుల్లో సరదాగా చక్కర్లు కొట్టేవాడిని" అంటూ అప్పటి రోజులు గుర్తు చేసుకున్నారు.
కాగా, కమల్ మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన రాంబో 3 సినిమా 1988లో రిలీజ్ అయి బ్లాక్ బ్లాస్టర్ హిట్ సాధించింది. దీంతో ఐఎండీబీ క్రెడిట్స్‌లో కమల్ మేకప్ డిపార్ట్మెంట్ కేటగిరీలోనూ స్థానం సంపాదించుకున్నారు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత కమల్ మల్టీటాలెంట్ తెలుసుకుని షాక్‌తో పాటు ఫిదా అవుతున్నారు అభిమానులు. కమల్ యాక్టింగ్, మ్యూజిక్, రైటింగ్, ప్రొడ్యూసింగ్, డైరెక్టింగ్, మేకప్ ఆర్టిస్ట్ ఇలా విభాగాలన్నింటిలో ఆయనమించిన వారు ఉండరంటూ కొనియాడుతున్నారు.