Dhanush In Avengers:హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీ అవెంజర్స్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కళ్లు చెదిరే గ్రాఫిక్స్, వేరే ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లేలా వుండే విజువల్ ఎఫెక్ట్ కారణంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అవెంజర్స్ సినిమాలను తెగ ఇష్టపడుతుంటారు. రస్సో బ్రదర్స్ తెరకెక్కించిన అవెంజర్స్ చిత్రాల్లో ఇప్పటి వరకూ రిలీజ్ అయిన ప్రతి సిరీస్ స్ట్రెయిట్ ఇండియన్ సినిమాలతో పోటీ పడి మరీ వసూళ్లు సాధించింది.
రస్సో బ్రదర్స్ చివరగా విడుదల చేసిన 'అవెంజర్స్ : ది ఎండ్ గేమ్' చిత్రం ఇక అవెంజర్స్ కథ ముగిసింది అన్నట్లుగా ఉంటుంది. దీంతో అవెంజర్స్ సిరీస్ ఇక ఉండవనీ అంతా అనుకున్నారు. మార్వెల్ ఫ్యాన్స్ ఎంతో నిరాశ పడుతున్న సమయంలో జూలై 2024లో మళ్లీ ఆశ్చర్చకరమైన కబురు తెలిపారు రస్సో బ్రదర్స్. మార్వెల్ ప్రపంచానికి ప్రజలను మళ్లీ తీసుకెళతానంటూ ఆశలు రేకెత్తించే ప్రకటన చేశారు. అవెంజర్స్ కథ ఇంకా ముగిసిపోలేదనీ, త్వరలోనే మరో రెండు సిరీస్ రాబోతున్నామని వారు వెల్లడించారు. 'అవెంజర్స్: డూమ్స్ డే' పేరుతో ఒకటి, 'అవెంజర్స్ సీక్రెట్ వార్స్' అంటూ మరొకటి 2026, 2027 సంవత్సరాల్లో వరుసగా విడుదల కాబోతున్నట్లు మార్వెల్ స్టూడియోస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్ పాత్రలో కనిపించనున్నారట.
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? తమిళ సూపర్ స్టార్ ధనుష్ ఈ సిరీస్లో భాగం కానున్నారనే వార్తలు ప్రస్తుతం బాగా వినిపిస్తున్నాయి. తాజాగా 'రాయన్' సినిమాతో తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ హీరోకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. తన విలక్షణ నటనతో కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈ మాస్టారు ఇప్పుడు హాలీవుడ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారని సమాచారం.