Dhanush Captain Miller OTT : ప్రతి వారం ఓటీటీలోకి ఎన్నో సరికొత్త కంటెంట్ ఉన్న చిత్రాలు, సిరీస్‌లు వచ్చి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంటాయి. అలాగే థియేటర్లలో విడుదలైన సినిమాలు కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే వీటిలో కొన్ని థియేటర్లలో కాస్త డివైడ్ టాక్ అనిపించుకున్నప్పటికీ ఓటీటీలో మాత్రం విశేష ఆదరణను అందుకుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ సినిమానే తాజాగా ఓటీటీలోకి వచ్చి రికార్డ్ స్థాయిలో ఫుల్ రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది.
వివరాల్లోకి వెళితే. కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత్ర ఎలాంటిదైనా అందులో ఒదిగిపోయి నటిస్తారు. ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించి అలరిస్తుంటారు. అలా ఇప్పటి వరకు ఎన్నో రకాల చిత్రాల్లో నటించి విలక్షణమైన నటుడిగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన నటించిన లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించారు.
ఈ సంక్రాంతికి జనవరి 12న భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిందీ చిత్రం. అయితే ఆ సమయంలో థియేటర్ల కొరత ఉండడంతో తెలుగు వెర్షన్ విడుదల కాలేదు. అక్కడ మంచి రెస్పాన్స్ అందుకుందీ చిత్రం. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇక్కడ కూడా విడుదలై పర్వాలేదనిపించుకుంది. రీసెంట్గా థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత ఫిబ్రవరి 9 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.