Harish shankar Chota K Naidu Controversy :టాలీవుడ్ సీనియర్ కెమెరామెన్లలో చోటా కే నాయుడు ఒకరు. అలాగే టాప్ డైరెక్టర్లలో హరీశ్ శంకర్ కూడా ఒకరు. అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి హరీశ్ శంకర్‌తో జరిగే వివాదంపై స్పందించారు చోటా కే నాయుడు. తనకు సాధారణంగానే కోపం చాలా ఎక్కువ అని చెప్పుకొచ్చారు. కానీ ఆ కోపం ఎక్కువ సేపు ఉండదని పేర్కొన్నారు.
పని విషయంలో ఎవరితోనైనా ఎప్పుడైనా అసౌకర్యంగా ఫీల్ అయ్యారా? అని అడిగిన ప్రశ్నకు చోటా మాట్లాడుతూ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. "అలాంటివి సాధరణంగా వస్తూనే ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పరిష్కారం చేసుకుంటూ ఉంటాను. హరీశ్ శంకర్‌తో 'రామయ్య వస్తావయ్యా' సినిమా చేశాను. ఆయనేమో అస్తమానం నాకు అడ్డుపడేవాడు. అతడి స్క్రిప్ట్ పనిలో ఉండేవాడు. అలానే అది కాదు అన్న, ఇది కాదు అన్న అంటూ నాతో అనేవాడు. నేను అతడికి చెప్పేందుకు చాలా ట్రై చేశాను. కానీ అతడు వినలేదు. కాబట్టి వదిలేశాను. నా దగ్గర రెండు ఉంటాయి. మ్యాగ్జిమమ్ అవతలి వ్యక్తిని కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తాను. కన్విన్స్ అయితే ఓకే. లేదంటే వాళ్లకు ఏం కావాలో అదే చేస్తూ ముందుకు వెళ్తాను. అందులో కూడా ది బెస్ట్ ఇస్తాను. నాకు భగవంతుడు ఇచ్చిందేంటంటే కోపం. అది నాకు వస్తుంది కానీ ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వెంటనే సర్లే వాళ్లు కూడా కరెక్ట్ అయ్యిండొచ్చు కదా. ఓ సారి చూద్దాం అని అనుకుంటాను. ఒక వేళ మా దర్శకులు నాతో ఏదైనా రాంగ్ పని చేయించినా కూడా తర్వాత ఎండ్ ఆఫ్ దే వాళ్లే రియలైజ్ అవుతుంటారు. కోపం వచ్చినప్పుడల్లా ఒక నిమిషం నేను ఫైర్ అవ్వడం అనంతరం మా వాళ్లు నన్ను కన్విన్స్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి" అని చెప్పారు చోటా కే నాయుడు.