Bollywood Stars Refused To Work With Each Other :బాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. ఒక హీరో సినిమాలో మరో హీరో తళుక్కున మెరిసి ఆ చిత్రానికి అదనపు హంగులు అద్దుతుంటారు. అలానే పలు చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్లు కూడా కలిసి నటిస్తుంటారు. అయితే కొంత మంది తారలు మాత్రం అభిప్రాయ భేదాలు, లేదా ఇతరత్రా కారణాల వల్ల తన సహనటులతో కలిసి మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకీ వారెవరంటే?
సల్మాన్ ఖాన్ , ఐశ్వర్య రాయ్ బచ్చన్:
కండల వీరుడు సల్మాన్ ఖాన్, నటి ఐశ్వర్యారాయ్‌ల ప్రేమ కథ ఒకప్పుడు బాలీవుడ్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 1990- 2000మధ్యలో ఈ జంట రిలేషన్‌లో ఉన్నట్లు పలు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ తరువాత ఐశ్వర్య, సల్మాన్ మధ్య కొంత విభేదాలు తలెత్తగా, దీంతో వారిద్దరూ కలిసి పనిచేసిన 'హమ్ దిల్ దే చుకే సనమ్' చివరి సినిమాగా మిగిలిపోయింది. ఆ తర్వాత ఈ జంట మరే సినిమాలోనూ కనిపించలేదు.
సల్మాన్ ఖాన్ , వివేక్ ఒబెరాయ్ :
సల్మాన్‌ఖాన్, వివేక్ ఒబెరాయ్‌ల మధ్య జరిగిన వివాదం ఏకంగా వివేక్ కెరియర్‌నే దెబ్బ తీసిందని సినీ వర్గాల మాట. ఐశ్వర్యతో తనకున్న సంబంధం విషయంలో సల్మాన్ తనను బెదిరించాడంటూ ఆరోపిస్తూ వివేక్ ఒకానొక సమయంలో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. సల్మాన్‌తో బ్రేకప్ తర్వాత వివేక్‌తో కొన్నేళ్లు ఐశ్వర్య డేటింగ్ చేయటమే దీనికి కారణమని సమాచారం.
ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ :
బాలీవుడ్ సీనియర్ బ్యూటీస్ కరీనా కపూర్, ప్రియాంక చోప్రా ఒకే టైమ్‌లో స్టార్ ఇమేజ్ అందుకున్నారు. అయితే వారి మధ్య ఈగో క్లాషెస్ ఉండేవని, ఆ గొడవలు ఒక దశలో సెట్‌లో కొట్టుకునే వరకు వెళ్లాయన్న టాక్ కూడా వినిపించింది. 'ఐత్రాజ్' సినిమాలో కలిసి నటించిన కరీనా, ప్రియాంక షూటింగ్ సమయంలో గొడవ పడ్డారన్నది అప్పట్లో హాట్ టాపిక్. అయితే కొంతకాలం తరువాత వారిద్దరూ ఆ విషయాలు కొట్టి పడేశారు. ఒకే టైమ్‌లో ఫామ్‌లో ఉన్న హీరోయిన్స్ కావటం వల్ల సాధారణంగానే ఇద్దరి మధ్య పోటి ఉండేదని, ఆ పోటినే కొంత మంది పెద్ద గొడవలా క్రియేట్ చేశారని చెప్పుకొచ్చారు.