Bigg Boss Naga Manikanta Sister Comments: బిగ్‌బాస్ సీజన్ 8లో హౌజ్‌లో తన విషాదగాధ చెప్పి భోరున ఏడుస్తూ అందర్నీ ఏడిపించాడు మణికంఠ. తన తండ్రి చిన్నప్పుడే చనిపోయారని.. తల్లి రెండో పెళ్లి చేసుకుందని.. ఆ స్టెప్ ఫాదర్ తనని చాలా ఇబ్బందులు పెట్టాడని.. తల్లి క్యాన్సర్‌తో చనిపోయిన 11వ రోజునే ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారని.. తన తల్లి చనిపోతే దహన సంస్కారాలు అడుక్కుని చేశానని.. తీరా చనిపోయిన తన తల్లి తన కడుపునే పుడుతుందన్న ఆశతో పెళ్లి చేసుకుంటే.. కూతురు పుట్టిన తరువాత భార్య దూరం పెట్టిందని.. తాను అనాథగా మిగిలిపోయానంటూ భోరున ఏడ్చాడు మణికంఠ.
అయితే అతను చెప్పి విషయాలు విని అయ్యో పాపం.. చిన్న వయసులోనే ఇతనికి ఎంత పెద్ద కష్టం వచ్చిందని మణికంఠకి అండగా నిలుస్తున్నారు ఆడియన్స్. అయితే మణికంఠని అందరూ వదిలేయడం కాదు.. ఇతని మెంటాలిటీ వల్ల ఇతనే అందరికీ దూరం అవుతున్నాడనే విషయాలు మెల్ల మెల్లగా బయటకు వస్తున్నాయి. తాజాగా మణికంఠ సొంత చెల్లెలు కావ్య అమర్నాథ్.. తన అన్నయ్య ఇంట్లో నుంచి ఎందుకు బయటకు వచ్చేశాడు? అసలు మణికంఠని అతని స్టెఫ్ ఫాదర్ కొట్టేవాడా? తిట్టేవాడా? కావాలనే బయటకు పంపేశాడా? వీటన్నింటిపై పలు విషయాలను తెలియజేసింది. ఆ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతోన్నాయి.. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే..
"మేం హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. డాడీది గుంటూరు. నేను అన్నయ్య ఒక తల్లి బిడ్డలమే కానీ.. తండ్రి వేరు. మా ఫాదర్ పేరు అమర్ నాథ్. అన్నయ్యకి సంవత్సరన్నర ఉన్నప్పుడు అతని తండ్రి యాక్సిడెంట్‌లో చనిపోయారు. అన్నయ్య చిన్నోడు.. మమ్మీకి పెళ్లి చేయాలి అని పెద్దలు ఆలోచించారు. మా డాడీ, మమ్మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్. పరిచయం ఉంది. డాడీ అప్పుడు ఏం ఆలోచించారంటే.. చిన్న వయసులోనే భర్తని కోల్పోయింది.. పైగా చిన్న పిల్లోడు ఉన్నాడు. ఆమెకి లైఫ్ ఇద్దాం అని చెప్పి.. డాడీ పెళ్లి చేసుకున్నారు. ముందు నుంచి అమ్మ తెలియడం వల్ల వెంటనే పెళ్లి చేసుకున్నారు".
నిజంగానే కొట్టేవాడా: "నాకు, అన్నయ్యకి నాలుగున్నరేళ్లు గ్యాప్ ఉంది. అన్నయ్యకి నాకు.. ఆయన స్టెఫ్ ఫాదర్ అనే విషయం మేం చిన్నగా ఉన్నప్పుడు అస్సలు తెలియలేదు. అన్నయ్య ఏడో తరగతిలో ఉన్నాడు.. నేను నాలుగో తరగతిలో ఉన్నాను. అప్పుడు మా రిలేటివ్స్ ద్వారా ఆయన మా కన్నతండ్రి కాదని చెప్పారు. ఈయన మీ నాన్న కాదు.. పెంచిన తండ్రి అని అర్ధం చేసుకోలేని వయసులో ఉన్నప్పుడు అన్నయ్యకి ఈ విషయం చెప్పారు.
అప్పటి నుంచి అన్నయ్యలో మార్పు వచ్చింది. నాన్న అలా చేశారు.. ఇలా చేశారు.. కొట్టారు తిట్టారు అని అంటున్నాడు అన్నయ్య. ఏ తండ్రి పిల్లల్ని కొట్టడు? ఏ తండ్రి అయినా కొడతాడు. కొడితేనే కదా పిల్లలు వినేది. స్కూల్‌కి వెళ్లనని చెప్పడం.. హోమ్ వర్క్ చేయనని అనడం.. అమ్మని సతాయిస్తుంటే దెబ్బలు పడేవి. వాడితోపాటు నన్నూ కొట్టారు. నేను చిన్న పిల్లని కాబట్టి తక్కువ కొట్టారు. అన్నయ్య ఏడో తరగతికి వచ్చేవరకూ.. ఆయన మా తండ్రి కాదనే విషయం తెలియనంతవరకూ ఏ ప్రాబ్లమ్ లేదు.
కానీ ఎప్పుడైతే అన్నయ్యకి ఆయన కన్నతండ్రి కాదు అనే విషయం తెలిసిందో.. అప్పటి నుంచి తిరగబడటం స్టార్ట్ చేశాడు. నువ్వేంటి నన్ను కొట్టేది. నన్ను కొట్టడానికి నువ్వెవరు? నువ్వు నా కన్నతండ్రివి కాదు.. నన్ను కొట్టే హక్కు నీకు లేదని అనేవాడు. నాన్న గురించి వయసుకి మించిన మాటలు మాట్లాడేవాడు. అప్పుడు ఇంకా ఎక్కువ దెబ్బలు పడేవి. అల్లరి చేస్తే ఎప్పుడైనా కొట్టడం తిట్టడం చేసేవారు డాడీ. కానీ.. ఎప్పుడైతే ఈ నిజం తెలిసిందో.. అప్పటి నుంచి ఈయన నా కన్నతండ్రి కానందుకే కొడుతున్నాడని అనుకునేవాడు అన్నయ్య.