తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'పాపం, మహేశ్‌ బాబు పని గోవిందా!' - Mahesh Babu - MAHESH BABU

Mahesh Babu Okkadu Movie Title : మహేశ్​ బాబు హీరోగా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం "ఒక్కడు". అప్పట్లో రికార్డులకు తిరగరాసిన ఈ చిత్రం కథ రాయడం నుంచి టైటిల్ వరకూ ఎన్నో విమర్శలను ఎదుర్కొందట. పూర్తి వివరాలు స్టోరీలో

source ETV Bharat
Mahesh babu (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 8:15 PM IST

Mahesh Babu Okkadu Movie Title :సూపర్ స్టార్ మహేశ్​ బాబు, భూమిక కాంబినేషన్లో గుణశేఖర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ ఫిలిమ్ "ఒక్కడు". స్పోర్ట్స్ అండ్​ యాక్షన్ ఫిలింగా రూపొందిన ఈ చిత్రం మహేశ్​ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్​గా నిలిచింది. అయితే 2003 సంక్రాంతి కానుకగా విడుదలైన "ఒక్కడు" చిత్రం - కథ రాయడం మొదలుకొని థియేటర్లలో విడుదల అయ్యే వరకూ చాలా రకాల ఇబ్బందులు, విమర్శలు ఎదురయ్యాయట.

"ఒక్కడు" సినిమా తీయడానికి ముందు గుణశేఖర్ మెగాస్టార్ చిరంజీవితో "మృగరాజు" సినిమా తీశారు. ఈ చిత్రానికి ఆశించిన ఫలితాలు దక్కకపోవడంతో ఈ సారి మంచి కథ ఎంచుకుని తానేంటో నిరూపించుకోవాలని ఫిక్స్ అయ్యారట గుణశేఖర్. సరిగ్గా అదే సమయంలో ఓ రోజు పత్రికలో వచ్చిన ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపిచంద్ ఇంటర్వ్యూ ఒకటి ఆయన్ని బాగా ఆకట్టుకుందట. అందులో గోపిచంద్​కు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టమున్నప్పటికీ ఆయన తండ్రికి నచ్చకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందనీ, అన్నింటినీ ఎదుర్కొని గోపీచంద్ ఛాంపియన్​గా ఎదగారని ఉందట. అది చదివిన గుణశేఖర్ తాను తీయబోయే సినిమాలో ఇదే కీలకమైన అంశంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.

అలా పుల్లెల గోపిచంద్ ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా స్పూర్తి పొంది "ఒక్కడు" సినిమా కథ రాసుకున్న గుణశేఖర్ మహేశ్​ బాబును ఆశ్రయించగా ఆయన దానికి ఓకే చెప్పారట. నిర్మాతగా వ్యవహరించేందుకు ఎమ్మెస్ రాజు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. కానీ ఎమ్మెస్​ రాజు కూడా అప్పటికే ఫ్లాప్​లో ఉన్నారు. అయితే సినిమాలో ఎక్కువ సన్నివేశాలను చార్మినార్ దగ్గర చూపించాలనుకున్న గుణశేఖర్ సెట్ వేసేందుకు నిర్మాత ఒప్పుకుంటారో లేదో అని సందేహిస్తుండగా దానికి కూడా సిద్ధమేనని చెప్పారట ఎమ్మెస్ రాజు.

ఇక అప్పటికే "యువకుడు" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భూమికను ఇందులో కథానాయికగా ఎంచుకుంది చిత్రబృందం. మ్యూజిక్ డెరెక్టర్​గా మణిశర్మ, రచయితలుగా పరుచూరి బ్రదర్స్, కెమెరా మెన్ గా శేఖర్. వి. జోసెఫ్ ఇలా సినిమా కోసం టీం అంతా సెట్ అయ్యారట.

అంతా బాగానే ఉంది అనుకుంటుండగానే టైటిల్ విషయంలో సమస్య పెద్ద వచ్చి పడిందట. మొదట "ఒక్కడు" చిత్రానికి గుణశేఖర్ "అతడే ఆమె సైన్యం" అనే టైటిల్ అనుకున్నారట. కానీ అప్పటికే దాన్ని వేరెవరో రిజిస్టర్ చేసుకున్నారట. అదే టిటిల్ కావాలని ఎంత ట్రై చేసినా, బతిమాలుకున్నా కూడా కుదరలేదట. ఇక చేసేందేం లేక హీరో కబడ్డీ ప్లేయర్ కనుక "కబడ్డీ" అనే టైటిల్ పెట్టాలనకున్నారట. అదీ కుదరక చివరకు "ఒక్కడు" అనే టైటిల్​ను ఫిక్స్ చేశారట.

అన్నీ ఫిక్స్ అయి సినిమాను అనౌన్స్ చేసిన తర్వాత కూడా చాలా విమర్శలు ఎదుర్కొందట ఈ చిత్ర యూనిట్. ఓ పక్క గుణశేఖర్ దర్శకత్వం వహించిన "మృగరాజు", మరో పక్క ఎమ్మెస్ రాజు నిర్మాణంలో వచ్చిన "దేవిపుత్రుడు" రెండూ హిట్ కొట్టకపోవడంతో "ఈ ఇద్దరితో కలిసి మహేశ్​ పనిచేయడం ఏంటి? ఈ సినిమా పరిస్థితేంటో, తర్వాత మహేష్ కెరీర్ ఏంటో! పాపం, మహేశ్​ బాబు పని గోవిందా" అంటూ రకరకాలుగా మాట్లాడుకున్నారట. వాటన్నింటినీ ఎదుర్కొని సినిమాను విడుదల చేసిన మహేశ్​, గుణశేఖర్, ఎమ్మెస్ రాజులకు ఈ చిత్రం మంచి విజయాన్నే ఇచ్చింది. అప్పట్లోనే రూ.9కోట్లతో నిర్మించిన ఒక్కడు చిత్రం రూ.39కోట్లు వసూల్ చేసింది. రికార్డులను తిరగరాసి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కించుకుంది.

ABOUT THE AUTHOR

...view details