Balakrishna With Venkatesh In Shooting : టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్నమూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుగుతోంది. అయితే తాజాగా ఈ సెట్స్‌లోకి నటసింహం బాలకృష్ణ వచ్చి మూవీ టీమ్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. వెంకటేశ్, అనిల్‌తో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు. ఆ తర్వాత వారు ఫొటోలు దిగారు. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో అనిల్, బాలయ్య కలిసి 'భగవంత్ కేసరి' సినిమా కోసం వర్క్ చేసిన సంగతి తెలిసిందే.
'ఎఫ్ 2', 'ఎఫ్ 3' తర్వాత వెంకటేశ్, అనిల్ రావిపూడి కలిసి పనిచేస్తున్న సినిమా కావడం వల్ల అభిమానుల్లో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో ఈ కాంబోలో వచ్చిన సినిమాలు కామెడీ ఎంటర్టైనర్గా ఆకట్టుకున్నాయి. దిల్‌రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో వెంకీతో పాటు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. క్రైమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేశ్ ఓ మాజీ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా కోసం 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.