Avantika Vandanapu Trolls :బాలనటిగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన అవంతిక వందనపు ప్రస్తుతం హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా ఓ అరుదైన ఘనత కూడా దక్కించుకుంది. హైదరాబాదీ అమ్మాయి అయి ఉండి హాలీవుడ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాక ఓ ప్రతిష్ఠాత్మక అవార్డును కూడా సొంతం చేసుకుని తెలుగు ప్రేక్షకులు గర్వించేలా చేసింది. అయితే ఈమెపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె తనపై వస్తున్న ట్రోలింగ్ గురించి రియాక్ట్ అయింది.
హద్దులు దాటిన అభిమానం - ఈ అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉందని అవంతిక చెప్పింది. ఇది కేవలం తన పనికి మాత్రమే లభించిన సత్కారం కాదని, హద్దులు దాటిన అభిమానానికి దక్కిన అవార్డనీ చెప్పుకొచ్చింది. గ్లోబల్ సినిమాలో భారత దేశం భాగం కావడం వల్లే తనకు ఈ అరుదైన అవార్డు దక్కిందని కూడా అవంతిక చెప్పింది. అలానే ఒకానొక సమయంలో తాను ఎదుర్కొన్న అవమానాలను గురించి తెలిపింది.
చాలా బాధపడ్డాను - కొన్ని నెలల క్రితం అవంతిక వందనపు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందులో ఆమె మాట్లాడిన అమెరికా యాసను, తన మాటలను చాలా మంది నెగిటివ్‌గా ట్రోల్ చేశారు. ఆ ట్రోల్స్ కరణంగా తాను చాలా బాధపడ్డానని చెప్పింది అవంతిక. నిజానికి ఆ రోజు తాను పాజిటివ్‌గా మాట్లాడిన విషయాలను నెగిటివ్ విషయాలుగా చెప్పి అనవసరంగా ట్రోల్ చేశారని బాధపడింది. అయినప్పటికీ తాను అవేవీ పట్టించుకోకుండా కెరీర్ లో ఎదగాలనే ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ అవార్డు తనకు మరింత గుర్తింపు ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది.