Apollo Ramchran Biopic : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటి వరకైతే ఎవరి బయోపిక్‌లోనూ నటించలేదు. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే, తాను స్పోర్ట్స్ పర్సన్ రోల్ చేయాలని ఉందంటూ ఆ మధ్య తన మనసులో మాటను బయట పెట్టారు. దీంతో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ ఓకేనా అని అడగగా - ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని అన్నారు. అయితే తాజాగా రామ్‌చరణ్ ఓ బయోపిక్‌లో నటించడంపై ఉపాసన మాట్లాడారు. తన తాత బయోపిక్‌లో రామ్‌చరణ్ నటిస్తారా? అన్న విషయంపై ఆమె సమాధానమిచ్చారు.
'ప్రతాప్ రెడ్డి'గా రామ్ చరణ్ : రామ్ చరణ్ సతీమణి, ఎంట్రప్రెన్యూర్ ఉపాసన కామినేని కొణిదెల తాతయ్య ప్రతాప్ సి రెడ్డి. ఈయన గురించి చాలా మందికి తెలుసు. అపోలో హాస్పిటల్ వ్యవస్థాపకుడాయన. దేశ విదేశాల్లో అపోలో సేవలను విస్తరించారు. హెల్త్ కేర్ రంగంలో అరుదైన ఖ్యాతి గడించారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఫిబ్రవరి 5న ఆయన పుట్టినరోజు.
తాతయ్య పుట్టినరోజు సందర్భంగా 'ది అపోలో స్టోరీ' పేరుతో ఉపాసన ఓ పుస్తకాన్ని లాంఛ్ చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రతాప్ సి రెడ్డి కుటుంబ సభ్యులు కొందరు హాజరై సందడి చేశారు. అయితే ఈ పుస్తకావిష్కరణలో ఉపాసనకు ఓ ప్రశ్న ఎదురైంది. అదేంటంటే 'మీ తాతయ్య జీవితంపై బయోపిక్ ఏమైనా తీసే ఆలోచన ఉందా? సినిమా వస్తుందా?' అని అడగగా - 'భవిష్యత్తులో బయోపిక్ రావచ్చు' అని ఉపాసన పేర్కొన్నారు. 'ప్రతాప్ సి రెడ్డి పాత్రలో రామ్ చరణ్ నటించే అవకాశం ఉంటుందా?' అని అడగగా - 'అది డైరెక్టర్ విజన్‌పై ఆధారపడి ఉంటుంది' అని ఉపాసన చెప్పుకొచ్చింది.