Anushka Shetty Rare Laughing Disease : 'సూపర్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు స్వీటీ అనుష్క శెట్టి. తన అందం, అభినయంతో యూత్‌ను ఆకట్టుకున్న ఈ బ్యూటీ అనతికాలంలోనే సూపర్‌స్టార్‌గా ఎదిగారు. సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. 'బాహుబలి'తో ఇంటర్నేషనల్ లెవెల్లోనూ గుర్తింపు పొందారు.
అయితే చాలాకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క తాజాగా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు. కానీ ఆమె ఎటువంటి ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొనలేదు. తాజాగా ఇదే విషయంపై అనుష్క స్పందించారు. తాను ఓ అరుదైన సమస్యతో బాధపడుతున్నారని, కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉండటానికి ఇది కూడా ఒక కారణమని తెలిపారు. ఇంతకీ అదేంటంటే?
ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే ఆమెకు అదే తన సమస్య అంటూ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. తనకు చాలా అరుదైన 'నవ్వు జబ్బు' ఉందని తెలిపారు. ఆ విషయం బయటపెట్టేసరికి అభిమానుల్లో, మీడియా వాళ్లలో అదేంటో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. దీన్ని మెడికల్‌గా సూడోబుల్బర్ ఎఫెక్ట్ అని పిలుస్తారట. ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్లు అదుపు లేకుండా ఏడవడమైనా, నవ్వడమైనా చేస్తూనే ఉంటారట.
"నాకు నవ్వే సమస్య ఉంది. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. నేను నవ్వడం మొదలుపెడితే దాదాపు 15 నుంచి 20 నిమిషాల వరకూ నవ్వుతూనే ఉంటాను. సినిమా చూస్తున్నప్పుడు ఏదైనా కామెడీ సీన్స్ వస్తే నేను కిందపడి మరీ నవ్వేస్తుంటాను. షూటింగ్ సమయంలో కూడా ఇది ఇబ్బందిగానే ఉండేది" అని ఆమె ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సమస్యలో సోషల్ గా తిరగడం కూడా ఆమెకు ఇబ్బందేనట.