Animal Sandeep Reddy Vanga Bollywood Controversy : 'యానిమల్' సినిమా సౌత్‌తో పాటు నార్త్‌లోనూ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా దర్శకుడు సందీప్ వంగా స్థాయిని మరింత పెంచింది. కానీ ఈ చిత్రంపై కొంతమంది నార్త్ సెలబ్రిటీల నుంచి విమర్శలు గట్టిగానే వచ్చాయి. దీనిపై సందీప్ వంగా కూడా తిరిగి వారిపై రివర్స్ కౌంటర్ వేస్తున్నారు. అయితే ఇది ఇప్పుడు బాగా చర్చనీయాంశంగా మారుతోంది. మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ గతంలో యానిమల్ చిత్రంలోని సన్నివేశాన్ని పరోక్షంగా విమర్శించారు. ఇలాంటి చిత్రాలు వెరీ డేంజరస్ అని పేర్కొన్నారు. దీనిపై సందీప్ రెడ్డి వంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. "మీర్జాపుర్ సిరీస్‌లో ఎన్నో అభ్యంతరకరమైన పదాలు ఉన్నాయి. దానిని నిర్మించింది జావేద్ కుమార్ ఫర్హాన్ అక్తర్. ముందు ఆయనకు సలహా ఇవ్వమనండి. ప్రపంచంలో ఉన్న అసభ్యపదాలన్నీ ఆ సిరీస్‌లోనే ఉన్నాయి. నేను దాన్ని పూర్తిగా చూడలేదు కానీ అప్పుడప్పుడు కనిపించిన సీన్స్ చూసి వాంతి ఫీలింగ్ కలిగింది. కాబట్టి ముందు తన కుమారుడు నిర్మించే వాటిపై ఆయన్ను శ్రద్ధ పెట్టమనండి" అని ఘాటు రిప్లై ఇచ్చారు సందీప్.
ఇకపోతే స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి కూడా మాట్లాడారు. ఆమె నా యానిమల్‌పై నెగిటివ్ రివ్యూ ఇచ్చినా నాకెలాంటి ఇబ్బంది లేదు. నేను తీసే చిత్రాల్లో ఆమెకు సరిపడ పాత్రలు ఉంటే స్టోరీ చెబుతాను. ఆమె నటించిన రీసెంట్ మూవీ 'క్వీన్' చూశాను. నాకు నచ్చింది" అని సందీప్ అన్నారు. దీనిపై కంగనా కాస్త ఘాటుగానే స్పందించింది. "సినిమాను సమీక్షించడానికి, విమర్శించడానికి ఎంతో తేడా ఉంది. 'యానిమల్'పై నా రివ్యూ గురించి మీరు నవ్వుతూ మాట్లాడారు. అది మీకు నాపై ఉన్న గౌరవం. కానీ, మీ సినిమాల్లో నాకు ఎలాంటి పాత్రలు ఇవ్వకండి. ఒకవేళ అలా ఇస్తే మీ ఆల్ఫా హీరోలు ఫెమినిస్ట్‌లు అవుతారు. అది మీకే డేంజర్. సినీ ఇండస్ట్రీకి మీరు కావాలి" అంటూ వ్యంగ్యంగా బదులిచ్చింది.