Akshay Kumar Sarfira Movie :బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా 'సర్ఫిరా' అనే సినిమాతో అభిమానులను పలకరించారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేదు. అంతేకాకుండా ప్రస్తుతం స్లోగానే థియేటర్లలో నడుస్తోంది. అంతకముందు ఆయన నటించిన బడేమియా చోటేమియా కూడా తీవ్ర నిరాశపరిచింది. దీంతో వరుస ఫ్లాప్‌ల గురించి అక్షయ్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
"ప్రతీ సినిమాను ఎంతో ఇష్టంతోనే చేస్తాం. దానికోసం ప్రాణం పెడతాం. అటువంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందటం అనేది చూస్తుంటే మన హృదయం ముక్కలవుతుంది. ప్రతి సినిమా నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే, విజయాన్ని సాధించాలనే తపన దాని వల్ల మరింత పెరుగుతుంది. కెరీర్ ప్రారంభంలోనే నేను ఈ విషయాన్ని తెలుసుకున్నాను. సినిమా రిజల్ట్ కొన్ని సార్లు మనల్ని బాధించవచ్చు. అది మన కంట్రోల్లో లేనిది. కష్టపడి పని చేయటం మాత్రమే మన చేతిలో ఉంటుంది. అలా నన్ను నేను ఎంకరేజ్ చేసుకుంటూ మరో సినిమా కోసం పనిచేయడం మొదలుపెడుతుంటాను. డిసిప్లైన్తో పాటు, పనిపై నిబద్దత ఉండటమే నా అసలు బలం. ఫుడ్, వర్కౌట్స్, వర్క్ ఇలా అన్నింటికోసం ఒక టైమ్‌టేబుల్ పెట్టుకొని ఫాలో అవుతుంటాను. శారీరకంగా, మానసికంగా నేను స్ట్రాంగ్‌గా ఉండటానికి అదే కారణం. కొవిడ్ తర్వాత ఇండస్ట్రీ ఎంతో మారింది. ఆడియెన్స్ కూడా డిఫరెంట్ కంటెంట్ ఉండే సినిమాలు చూసేందుకు ఇష్టపడుతుంటారు. అందుకు అనుగుణంగానే స్క్రిప్ట్‌లు సెలక్ట్ చేసుకోవడం కూడా ఎంతో అవసరం" అంటూ అక్షయ్ పేర్కొన్నారు.