Actors Who Won Most National Film Awards : జాతీయ చలన చిత్ర అవార్డులకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవాలనేది ప్రతి నటుడి కల. ఇటీవలే పుష్ప సినిమాకు గానూ టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకున్నాడు. దీంతో మూవీ లవర్స్‌లో ఈ అవార్డులపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అత్యధిక సార్లు జాతీయ ఉత్తమ నటుడు అవార్డును ఏ నటుడు గెలుచుకున్నారంటూ నెట్టింట ఆరా తీయడం మొదలెట్టారు. అయితే ఈ రికార్డులో టాప్ లిస్ట్‌లో పేరు సంపాదించుకున్న స్టార్ ఒకరు ఉన్నారు. ఆయన తన సుదీర్ఘ సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. బాలీవుడ్‌కు చెందిన నటుడే అయినప్పటికీ ఆయనకు దేశవిదేశాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. 90స్ కిడ్స్ నుంచి ఇప్పటి యూత్ వరకు ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇంతకీ ఆయన ఎవరు అని అనుకుంటున్నారా ? అయితే ఈ కథలోకి వెళ్లాల్సిందే.
'మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ్ హై' , 'మై హూ డాన్' అంటూ 80వ దశకాన్ని ఊర్రూతలూగించారు ఆ స్టార్ హీరో. 80 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లకు దీటుగా నటిస్తూ అభిమానుల మన్నలను పొందుతున్నారు. ఈయన సినిమాలకు నార్త్‌లోనే కాకుండా సౌత్‌లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. అలా తన కెరీర్లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఆ స్టార్ నటుడు ఇప్పటి వరకు బెస్ట్ యాక్టర్‌గా నాలుగు సార్లు జాతీయ అవార్డును అందుకున్నారు. ఆయనెవరో కాదు బీటౌన్ అగ్ర నటుడు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్.
1990లో వచ్చిన 'అగ్నిపథ్' సినిమాకు గాను ఆయన తొలి జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత 2005లో సంజయ్ లీలా బన్సాలీ డైరెక్షన్లో వచ్చిన 'బ్లాక్' సినిమాతో రెండోసారి ఆయన ఖాతాలో ఉత్తమ నటుడి అవార్డు పడింది. ఇక 2009లో వచ్చిన 'పా' చిత్రానికి బెస్ట్ నేషనల్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. చివరగా ఆయన 2015 లో వచ్చిన 'పీకూ' చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడిగా నాల్గవ సారి ఎంపికయ్యాడు.