Actor Signed 40 Movies Before Debut :90వ దశకంలో బాలీవుడ్ లోని అతిపెద్ద స్టార్లలో ఈయన కూడా ఒకరు. అప్పట్లో భారీ పారితోషకాన్ని అందుకున్న జాబితాలో ఈయన ఉన్నారు. ఎక్కువగా యాక్షన్ సినిమాల్లోనే నటించినప్పటికీ 'ఫ్యామిలీ మ్యాన్'గానూ చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు.
ఇంతకీ ఆయన ఎవరో కాదు బీటౌన్ స్టార్ హీరో సునీల్ శెట్టి. 1992లో 'బల్వాన్' అనే సినిమాతో నటనా ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ సీనియర్ నటుడు ఇప్పటి వరకూ దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించి నార్త్‌తో పాటు సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. త్వరలోనే హేరా ఫేరీ-3లో శ్యామ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు.
తన తండ్రి చిన్నతనంలోనే ఇంటి నుంచి పారిపోయి ముంబయికి వచ్చారని, అక్కడ పొట్టకూటి కోసం ఓ రెస్టారెంటులో టేబుల్స్‌ను శుభ్రం చేసేవారని గుర్తుచేసుకున్నారు. తన చిన్నతనంలో పడుకునేందుకు మంచాలు లేక బియ్యం బస్తాలపై నిదురించేవారంటూ అప్పటి కష్టాలను చెప్పుకొచ్చారు.
తన మొదటి చిత్రం 'బల్వాన్' సంతకం చేసినప్పుడు ఆయన దాదాపు ఓ 40 సినిమా స్క్రిప్ట్‌లకు ఓకే చేశారట. కనీసం స్క్రిప్ట్ కూడా చదవకుండానే ఆయన కొన్ని సినిమాకు సంతకం చేసేశారట. అలా 'బల్వాన్' సినిమా థియేటర్లలోకి రాకముందే ఆయన 40 చిత్రాలకు సంతకం చేసినట్లు చెప్పుకొచ్చారు. 'బల్వాన్' మంచి విజయం దక్కించుకోవడంతో ఆయన కెరీర్ ఓ ములుపు తిరిగింది. 'గోపీ కిషన్', 'మోహ్రీ', 'ధడ్కన్' వంటి మరిన్ని సినిమాలు హిట్ అయ్యాయని శెట్టి చెప్పుకొచ్చారు.