Saif Ali Khan Attack :ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను కత్తితో పొడిచిన దుండగుడిని గుర్తించినట్లు పోలీసులు ప్రకటించారు. దొంగతనానికి వచ్చిన వ్యక్తి సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసినట్లు ప్రాథమికంగా నిర్దారించారు. అతడిని పట్టుకునేందుకు పది బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరోవైపు సైఫ్‌కు విజయవంతంగా శస్త్రచికిత్సచేసి కత్తిని తొలిగించినట్లు తెలిపిన ముంబయి లీలావతి ఆసుపత్రి వైద్యులు ప్రమాదం నుంచి బయటపడ్డారని ప్రకటించారు.
ఇదీ జరింది
సైఫ్ అలీఖాన్ పటౌడీపై గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. ముంబయి బాంద్రాలోని తన నివాసంలో సైఫ్ అలీఖాన్, ఆయన భార్య కరీనా కపూర్ ఖాన్, పిల్లలతో కలిసి రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక దుండగుడు వారి ఇంట్లోకి ప్రవేశించాడు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అలికిడి కావడంతో నిద్రలేచిన సైఫ్ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరికీ ఘర్షణ జరగ్గా గుర్తుతెలియని వ్యక్తి పదునైన ఆయుధంతో సైఫ్‌ను పలుమార్లు పొడిచి పారిపోయాడు. కత్తిగాట్లకు గురైన సైఫ్ అలీఖాన్‌ను ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ముంబయిలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. కారు సిద్ధంగా లేకపోవడం వల్ల ఆటోలో సైఫ్‌ను తరలించినట్లు సమాచారం.
అలీఖాన్‌ను పరామర్శించిన ప్రముఖులు
తెల్లవారుజామున మూడున్నర గంటలకు లీలావతి ఆసుపత్రికి చేరుకున్న సైఫ్‌కు ఒంటిపై ఆరుచోట్ల గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. నాలుగు చోట్ల కొద్దిగా, రెండు చోట్ల లోతుగా గాయమైనట్లు తెలిపారు. వెన్నెముక వరకూ 2.5 ఇంచుల కత్తి శరీరంలోకి దిగిందని తెలిపిన డాక్టర్ నీరజ్ ఉత్తమని, న్యూరోసర్జన్ నితిన్ డంగే శస్త్రచికిత్స చేసి ఆయుధాన్ని తొలిగించామని వివరించారు. వెన్నెముక నుంచి కారుతున్న స్రావాలను నియంత్రించ గలిగామని డాక్టర్ నితిన్ డంగే చెప్పారు. సైఫ్ ఎడమ చేతి మణికట్టుపైనా లోతైన గాయం కావడం వల్ల ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు డాక్టర్ నీరజ్ ఉత్తమని వెల్లడించారు. శస్త్రచికిత్స తర్వాత సైఫ్ పూర్తిగా ప్రమాదం నుంచి బయటపడ్డారని శుక్ర లేదా శనివారం ఐసీయూ నుంచి వార్డుకు తరలిస్తామని వెల్లడించారు. మరోవైపు సైఫ్ అలీఖాన్‌ను కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు ప్రముఖులు పరామర్శించారు.
ఎలాంటి ప్రమాదం లేదు
శస్త్రచికిత్స జరిగిన తర్వాత సైఫ్ కోలుకుంటున్నారని ఆయన వ్యక్తిగత బృందం కూడా ప్రకటించింది. సైఫ్‌కు ఎలాంటి ప్రమాదంలేదని తెలిపింది. గుర్తుతెలియని వ్యక్తి దొంగతనం చేసేందుకు ఇంట్లోకి చొరబడిన సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేశామని అభిమానులు, మీడియా సంయమనం పాటించాలని కోరింది.
నిందితుడి కోసం పది బృందాలు
సైఫ్ అలీఖాన్ ప్రతినిథులు ఇచ్చిన ఫిర్యాదుతో ముంబయి బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఆర్ఐను నమోదైంది. దాడి ఘటనను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఇంటికి వెళ్లి పని మనుషులను ప్రశ్నించారు. ఒక పనిమనిషిని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు పిలిచి వాంగ్మూలం నమోదు చేశారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌తో సైఫ్ ఇంటి పరిసరాలను పరిశీలించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్‌లు నటుడి ఇంటి వద్ద ఆధారాలను సేకరించాయి. దొంగతనం చేసేందుకు మెట్ల వెనక నుంచి వచ్చిన దుండగుడు అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు బయటకు వచ్చేందుకు ఏర్పాటు చేసిన అత్యవసర మెట్ల ద్వారా లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు పది బృందాలు ఏర్పాటు చేశామన్నారు.