తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'గంగోత్రి' టు 'పుష్ప'​ - రూ. 100 నుంచి రూ.300కోట్ల వరకూ​! - బన్నీ సినీ జర్నీ ఎలా సాగిందంటే? - ALLU ARJUN PUSHPA 2

తొలి సంపాదన 100 రూపాయలు!- కట్​ చేస్తే రూ.300కోట్ల రెమ్యూనరేషన్​తో టాప్​లోకి- బన్నీ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?

Allu Arjun Pushpa 2
Allu Arjun Pushpa 2 (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2024, 12:01 PM IST

Allu Arjun Pushpa 2 : పుష్ప అంటే ఫ్లవర్​ అనుకుంటివా వైల్డ్​ ఫైర్ అంటూ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​. గతంలో వచ్చిన అభిమానుల్లో బన్నీకి ఉన్న రేంజ్​ ఏంటో తెలియడానికి ఈ ఒక్క క్యారెక్టర్​ చాలు అనేంతలా నటించారు ఆయన. అందుకే రూ.100 కోట్లు, రూ.200 కోట్లు కాదు ఒక్క సినిమాకే ఏకంగా రూ.300 కోట్లు పారితోషికం అందుకుంటున్నారు. ఇటీవలే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న టాప్‌-10 భారతీయ నటుల జాబితాలో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అయితే ఆయన కేవలం రూ.100 పారితోషికంతో తన సినీ జర్నీని ప్రారంభించిన సంగతి మీకు తెలుసా? 'పుష్ప 2' మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో బన్నీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం.

డ్యాన్స్‌ చేసి హీరోగా మారి
అల్లు అర్జున్‌కు డ్యాన్స్‌ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఆయన సినిమాల్లో యాక్టింగ్ ఎంత పవర్​ఫుల్​గా చేస్తారో, డ్యాన్స్​ కూడా ఇరగదీస్తారు. అయితే తనలోని ఈ ట్యాలెంట్​ తొలిసారి బయటపడింది మాత్రం చిరంజీవి బర్త్​డే వేడుకల్లోనే. ఓ సారి చిరు బర్త్​డే సెలబ్రేషన్స్​లో బన్నీ డ్యాన్స్ వేయగా, అది ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు దృష్టి ఆకర్షించింది. బన్నీని చూసి మురిసిపోయిన ఆయన తన తల్లికి రూ.100 అడ్వాన్స్‌ ఇచ్చి, పెద్దయ్యాక మీ అబ్బాయిని నేను హీరోని చేస్తానంటూ మాటిచ్చారట. అలా 'గంగోత్రి' (2003)తో వెండితెరకు పరిచయం అయ్యారు అల్లు అర్జున్.

వాళ్లు అభిమానులు కాదు ఆర్మీ
'గంగోత్రి'తో మంచి విజయం సాధించినా కూడా ఏడాది పాటు ఖాళీగా ఉన్నారు బన్నీ. ఆయనతో సినిమా చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపని పరిస్థితి ఏర్పడింది. అప్పుడే సుకుమార్​ 'ఆర్య' కథ వినిపించారు. ఇక ఈ చిత్రం బన్నీ కెరీర్​ను ఓ మలుపు తిప్పిందనే చెప్పాలి. తనలోని అసలైన డ్యాన్సర్‌ని చూపించేందుకు కూడా ఆ సినిమా ఓ వేదికగా నిలిచింది. డ్యాన్స్‌, ఫ్రెష్‌ లవ్‌స్టోరీ, మ్యూజిక్‌ ఇలా పటు ఎలిమెంట్స్​ వల్ల యూత్​ 'ఆర్య'కు బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన 'బన్నీ', 'దేశముదురు', 'జులాయి', 'S/o సత్యమూర్తి' ఇలా పలు సినిమాలు తన సినీ కెరీర్​లో ఓ స్టెప్పింగ్ స్టోన్స్​గా మారాయి.

కమర్షియల్​వే కాదు అవి కూడా
కమర్షియల్‌ చిత్రాలే కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ మెప్పించారు అల్లు అర్జున్‌. తన ట్యాలెంట్​తో వాటికి జీవం పోశారు. 'వేదం'లో కేబుల్‌ రాజును ఎవరూ మర్చిపోలేరు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో బన్నీ నటన కన్నీళ్లు పెట్టిస్తుంది. 'రుద్రమదేవి'లోని గోన గన్నారెడ్డి పాత్ర అయినే ఎవర్‌గ్రీన్‌ అనే చెప్పాలి. అల్లు అర్జున్‌ కనిపించిన ప్రతి సీన్​ ఫుల్‌ జోష్‌తో ఉంటుంది. 'నా పేరు సూర్య'తో నటుడిగా మరో మెట్టు ఎక్కారు బన్నీ. తన కెరీర్‌లో మానసికంగా, శారీరకంగా ఎక్కువ కష్టపడింది ఆ సైనికుడి పాత్ర కోసమేనని ఓ సందర్భంలో బన్నీ చెప్పుకొచ్చారు.

టైటిల్‌ మాత్రం సాఫ్ట్‌ లుక్కేమో ఫైర్‌!
బన్నీ- సుకుమార్‌ కాంబోలో వచ్చిన 'ఆర్య', 'ఆర్య 2' ఒక ఎత్తు అయితే ఈ ఇద్దరి కలయికలో వచ్చిన 'పుష్ప: ది రైజ్‌' మరో ఎత్తు. సాఫ్ట్‌ టైటిల్‌ పెట్టినా హీరో రఫ్‌ లుక్‌తో ఆ సినిమా అనౌన్స్​మెంటే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆ తర్వాత వచ్చిన ప్రతి అప్‌డేట్‌ సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా? అన్నట్లు ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపింది. అలా 2021 డిసెంబరు 17న బాక్సాఫీసు ముందుకొచ్చిన 'పుష్ప 1' అంచనాలు దాటేసి దాదాపు రూ.360 కోట్లు వసూళ్లు సాధించింది. అంతేకాకుండా బన్నీకి బెస్ట్ యాక్టర్​గా నేషనల్ అవార్డు అవార్డు అందించింది.

ఇక దుబాయ్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో 'తగ్గేదే లే' సిగ్నేచర్‌ మేనరిజంతో అల్లు అర్జున్‌ మైనపు విగ్రహం పెట్టడం మరో విశేషం. ఇంతతి ఘనత సాధించిన 'పుష్ప 1'కు సీక్వెల్​గా రానున్న 'పుష్ప 2'పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే సుకుమార్‌ ఈ సీక్వెల్​కు మరిన్ని మెరుగులు దిద్దారు.

అక్కడ మల్లు అర్జున్‌
టాలీవుడ్​లోనే కాదు బన్నీకి మాలీవుడ్‌లోనూ ఫాలోయింగ్‌ ఎక్కువే. అందుకే అక్కడి ఫ్యాన్స్​ ఆయన్ను ముద్దుగా 'మల్లు అర్జున్‌' అని పిలుచుకుంటున్నారు. 'ఆర్య' నుంచి చాలా సినిమాలు మలయాళంలో డబ్‌ అయ్యాయి. నార్త్​లోనూ బన్నీ సినిమాలకు క్రేజ్ ఉంది. 'నా పేరు సూర్య', 'సరైనోడు', లాంటి వాటిని డబ్‌ చేసి యూట్యూబ్‌లో విడుదల చేయగా అక్కడ రికార్డు వ్యూస్‌ దక్కాయి.

ఫ్యామిలీ కోసం ఏమైనా
షూటింగుల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా తన ఫ్యామిలీతో గడపడాన్ని అసలు మిస్‌ అవ్వరు బన్నీ. ముఖ్యంగా స్పెషల్ డేస్​లో షెడ్యూల్ లేకుండా చూసుకుంటుంటారు. తన ఇద్దరు పిల్లలతో ఓ ఫ్రెండ్​లాగా మెలుగుతారు. సినిమాలో వైల్డ్‌ఫైర్‌లా కనిపించే ఈ ‘పుష్పరాజ్‌’ తెర వెనుక వెరీ ఎమోషనల్​!

బుక్‌ మై షోలో 'పుష్ప 2' హవా - సౌత్​లో మరో నయా రికార్డు సొంతం!

ఏపీలో 'పుష్ప 2' టికెట్‌ ధరల పెంపు - ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details