70th National Film Awards 2024 Aattam Movie : మలయళ చిత్రసీమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రయోగాత్మక చిత్రాలు చేసేందుకు ఎప్పుడు ముందుంటుంది. స్టార్‌లు కూడా ఇలాంటి చిత్రాలు చేసేందుకు వెనకాడరు. అందుకే అక్కడ కమర్షియల్ సినిమాల కన్నా అవార్డు విన్నింగ్ సినిమాలే ఎక్కువగా తెరకెక్కుతుంటాయి. అలాంటి ఓ చిత్రమే 'ఆట్టం'. ఇప్పుడు తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచి అందరీ దృష్టిని ఆకర్షించింది.
వివిధ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శన - 1954లో రిలీజైన '12 యాంగ్రీమెన్' అనే హాలీవుడ్ టెలివిజన్ షో ఆధారంగా ఈ చిత్రాన్ని మలయాళంలో తెరకెక్కించారు. దీనికి ఆనంద్ ఇకర్షి దర్శకుడు. ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో రిలీజ్ కన్నా ముందే వివిధ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ఇంటర్నేషల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ), ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్ (ఐఎఫ్‌ఎఫ్‌ఎల్‌ఏ), ఇంటర్నేషల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ (ఐఎఫ్ఎఫ్‌కే) వేదికలపై ఈ సినిమాను ప్రదర్శించడం విశేషం.
ఇదీ కథ(Aattam Movie Story) - కేరళలో 12 మంది నటులున్న ఓ నాటక బృందం ఉంటుంది. అందులో ఒక్కరే నటీమణి. అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినవారే. వీరిందరూ కూడా ఒక్కో పని చేసుకుంటూ ఉంటారు. అవకాశం దొరికినప్పుడల్లా వివిధ వేదికలపై తమ నాటకాలను ప్రదర్శిస్తూ ప్రతిభను నిరూపించుకుంటుంటారు.
అయితే ఈ బృందం ప్రదర్శించే నాటికలో వినయ్ (వినయ్ ఫోర్ట్), అంజలి (జరీన్ షిబాబ్), హరి (కళాభవన్ షాజాన్) కీలక పాత్రలు. కానీ ఈ నాటకంలో హరికి కాస్త అధిక ప్రాధాన్యం ఇస్తారు. అది వినయ్‌కు నచ్చదు.
ఈ క్రమంలోనే ఒక రోజు ఈ టీమ్ అంతా కలిసి ప్రదర్శించిన నాటకానికి ఓ విదేశీ జంట ముగ్ధులైపోతారు. దీంతో తమ రిసార్ట్‌లో వాళ్లకు ఆతిథ్యం ఇస్తారు. అప్పుడు అందరూ మద్యం మత్తులో మునిగి తేలుతారు. అయితే పార్టీ ముగిశాక అక్కడే అంజలి ఓ గదిలో కిటికీ పక్కనే పడుకుంటుంది. అప్పుడు ఓ వ్యక్తి అంజలి నిద్ర పోతున్న కిటికీ పక్కకు వచ్చి, ఆ కిటీలో నుంచి లోపలకు చేయి పెట్టి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. మరి ఈ 12 మంది ఉన్న బృందంలో అంజలితో తప్పుగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు? అంజలి ఆ విషయాన్ని ఎలా అందరి ముందు బయట పెట్టింది? చివరకు ఆ వ్యక్తిని గుర్తించారా? లేదా అన్నదే కథ.