2024 Tollywood Hit Cinemas : ఈ ఏడాది థియేటర్లలో ఎన్నో సినిమాలు సందడి చేశాయి. ఎంతో మంది తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందుకొచ్చారు. అందులో కొన్ని బ్లాక్‌బస్టర్స్ అవ్వగా, మరికొన్ని మాత్రం ఆడియెన్స్‌ను తీవ్ర నిరాశపరిచాయి. అయితే చాలా వరకూ ఈ సారి తెలుగులో ఎన్నో హిట్ సినిమాలు వచ్చి సందడి చేశాయి. మరి ఈ 2024కు విజయంతో వీడ్కోలు పలకనున్న ఆ తారలెవరు? వారి సినిమాల విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి
'రాజాసాబ్' రానున్నారుగా!
రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ ఈ ఏడాది 'కల్కి 2898 AD' సినిమాతో బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేశారు. గతేడాది 'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్' సాలిడ్ సక్సెస్ అందుకున్న ఈ తార, 'కల్కి'తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు. దీంతో 2025లో ఆయన నుంచి రానున్న 'రాజాసాబ్'పై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. హారర్ కామెడీ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం ఈ సినిమాతో పాటు హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఓ చిత్రంలో చేస్తున్నారు. ఇదీ 2025లోనే తెరపైకి వచ్చే అవకాశమున్నట్లు సినీ వర్గాల మాట.
'అరవింద సమేత', 'ఆర్‌ఆర్‌ఆర్' సక్సెస్‌తో డబుల్ హ్యాట్రిక్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్, అదే జోరుతో 'దేవర'ను హిట్ బాటలోకి నడిపించారు. ఇక 2025లో ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కాంబోలో 'వార్ 2' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అటు నార్త్‌తో పాటు ఇటు సౌత్‌లోనూ భారీ అంచనాలే ఉన్నాయి.
'సరైనోడు' తర్వాత సరైన్ హిట్ లేక సతమతమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మళ్లీ వరుస విజయాలతో టాలీవుడ్లో దూసుకెళ్తున్నారు. 'అల వైకుంఠపురములో', 'పుష్ప: ది రైజ్'తో కొనసాగిన ఈ సక్సెస్ జర్నీ ఈ డిసెంబరులో వచ్చిన 'పుష్ప 2: ది రూల్'తో పూర్తైంది.
వీళ్లు కూదా అదే బాటలో
కథానాయకుడు నానికి గతేడాది బాగా కలిసొచ్చింది. 'దసరా', 'హాయ్ నాన్న' సినిమాలతో వరుస విజయాలందుకుని బాక్సాఫీస్ ముందు జోరు చూపించారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది 'సరిపోదా శనివారం'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ అందుకున్నారు. దీంతో కొత్త ఏడాదిలో నాని నుంచి రానున్న 'హిట్ 3', 'ది ప్యారడైజ్' సినిమాలపై అంచనాలు రెట్టింపయ్యాయి.