2024 Indian Film Festival of Melbourne :గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తాజాగా ఆస్ట్రేలియాలో సందడి చేశారు. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతోన్న 'ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్'లో ఆయన గౌరవ అతిథిగా హాజరై ఆకట్టుకున్నారు. ఇక భారత సినీ పరిశ్రమకు చేసిన ఆయన సేవలకుగాను 'ఆర్ట్ అండ్ కల్చర్ బ్రాండ్ అంబాసిడర్'గా పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత అక్కడి ఫ్యాన్స్‌తో కాసేపు ముచ్చటించారు. అంతే కాకుండా ఆస్ట్రేలియాతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. గతంలో ఆయన ఆరెంజ్ సినిమా కోసం ఆస్ట్రేలియా వచ్చిన సంగతి తెలిసిందే.
"14 ఏళ్ల క్రితం 'ఆరెంజ్' కోసం నేను ఆస్ట్రేలియాకు వచ్చాను. నా కెరీర్లో అది మూడో చిత్రం. దాదాపు నెలరోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరిగింది. చిత్రీకరణ పూర్తయ్యక తిరిగి భారత్‌కు వెళ్లే సమయంలో నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఇక్కడి ప్రజల ప్రేమను, ఆ రోజులను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయితే అప్పటి కంటే ఇప్పుడే ఎక్కువ మంది భారతీయులు ఇక్కడ కనిపిస్తున్నారు. చూస్తుంటే నా హోమ్ టౌన్‌కు వచ్చినట్లు అనిపిస్తోంది. మీ అందరినీ చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. భారత సినీ ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం పట్ల నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. మీ అందరి వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ ఈవెంట్ నాకు ఎప్పటికీ స్పెషల్" అని చెర్రీ ఎమోషనల్ అయ్యారు.