TCS Starts Fresher Hiring For 2024 Batch : ప్రముఖ ఐటీ కంపెనీ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (టీసీఎస్) ఫ్రెషర్స్ హైరింగ్ చేపట్టింది. బీటెక్, బీఈ, ఎంఎస్సీ, ఎంఎస్, ఎంసీఎ పూర్తి చేసినవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 10లోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టెస్ట్ ఏప్రిల్ 26న నిర్వహిస్తారు.
ప్రస్తుతం డిజిటల్, ప్రైమ్, నింజా కేటగిరీల్లో నియామకాలు చేపడుతున్నట్లు టీసీఎస్ వెల్లడించింది. నింజా కేటగిరీ ఉద్యోగులకు ఏడాదికి రూ.3.36 లక్షలు; డిజిటల్ కేటగిరీ ఉద్యోగులకు ఏడాదికి రూ.7 లక్షలు; ప్రైమ్ కేటగిరీ ఎంప్లాయీస్‌కు ఏడాదికి రూ.9 నుంచి రూ.11.5 లక్షల వేతనం చెల్లించనున్నట్లు టీసీఎస్ వెల్లడించింది.
ప్రస్తుతం చాలా ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ ఉంటే, టీసీఎస్ మాత్రం ఫ్రెషర్స్ హైరింగ్ చేయడం విశేషం. అయితే ఈ తాజా రిక్రూట్మెంట్ ద్వారా ఎంత మందిని నియమించుకుంటారో చూడాల్సిందే.
2023-24 ఆర్థిక సంవత్సరంలో టెక్ పరిశ్రమ దాదాపు 60 వేల కొత్త ఉద్యోగాలను కల్పించనుందని ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ తెలిపింది. ఇదే జరిగితే మొత్తం ఉద్యోగుల సంఖ్య 54.30లక్షలకు చేరుకుంటుందని స్పష్టం చేసింది. గతేడాది సృష్టించిన దాదాపు 2.7 లక్షల ఉద్యోగాలతో పోలిస్తే, ఇది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు.
టీసీఎస్ ఉద్యోగులకు జనరేటివ్ ఏఐ శిక్షణ!
ఐటీ కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌కు (AI) ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ తమ దగ్గర ఉన్న 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐ స్కిల్స్‌లో ట్రైనింగ్ ఇస్తోంది. స్వయంగా కంపెనీయే ఈ విషయాన్ని వెల్లడించింది.
టీసీఎస్ ఈ ఏడాది జనవరిలో 1.5 లక్షల మందికి జనరేటివ్ ఏఐ శిక్షణ ఇచ్చింది. ఆ తర్వాత మరికొందరికి ట్రైనింగ్ ఇచ్చింది. అలా దఫదఫాలుగా ఇప్పటివరకు 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐ విభాగంలో ప్రాథమిక నైపుణ్య శిక్షణ కల్పించింది. ఇలా సంస్థలో పనిచేస్తున్నవారిలో, సగానికి పైగా ఉద్యోగులను ఏఐ ప్రొడక్టుల తయారీకి సన్నద్ధం చేసినట్లు తెలిపింది. ఏఐ విషయంలో టీసీఎస్ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటూ వస్తోంది. క్లౌడ్, ఏఐ విషయంలో కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ఆయా విభాగాల కోసం ప్రత్యేకంగా బిజినెస్ యూనిట్‌లను కూడా తొలుత టీసీఎస్సే ఏర్పాటుచేసింది. తాజాగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుంచి జనరేటివ్ ఏఐ కాంపిటెన్సీ పార్ట్‌నర్ స్టేటస్ అందుకున్నట్లు ప్రకటించింది.
SSC భారీ నోటిఫికేషన్ - 968 జేఈ పోస్టుల భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! - SSC JE Jobs 2024
సెయిల్‌లో 108 ఎగ్జిక్యూటివ్ & నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా! - SAIL Recruitment 2024