AI Prompt Engineers Recruitment : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)- పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న అంశం కూడా ఇదే. పెద్ద సంఖ్యల్లో కంపెనీలు దీని సాయంతో పనులను సులభంగా, తక్కువ సమయంలోనే పూర్తి చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో ఏఐ ఆధారిత ఉద్యోగాలపై ఆసక్తికరమైన అంశం తెలిసింది. ఏఐ ఆధారంగా చేసే ప్రాంప్ట్ ఇంజినీర్ ఉద్యోగాలకు దేశంలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. యాక్సెంచర్, ఐబీఎం, టాటా గ్రూప్ సహా పలు అగ్రశ్రేణి కంపెనీలు ప్రాంప్ట్ ఇంజనీర్ ఉద్యోగులను నియమించుకునే పనిలో ఉన్నాయి. ప్రాంప్ట్ ఇంజనీర్ ఉద్యోగి ఏం చేయాలి? ఈ జాబ్‌కు విద్యార్హతలు ఏంటి? వార్షిక శాలరీ ఏమాత్రం ఉంటుంది? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
భారీ శాలరీలు!
దేశంలో గత ఆరు నెలల్లో ప్రాంప్ట్ ఇంజినీర్ సహా పలు విభాగాల్లో 18,000-22,000 ఉద్యోగ నియామకాలు జరిగాయి. ప్రాంప్ట్ ఇంజినీర్ ఉద్యోగం పొందాలంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఆంగ్ల భాషపై పట్టు ఉండాలి. అయితే ఏఐ, మెషీన్ లెర్నింగ్ సర్టిఫికేషన్ కలిగిన ఇంజినీర్లు దాదాపుగా రూ. 20 లక్షల వార్షిక వేతనాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అప్పుడే ఉద్యోగంలో జాయిన్ ప్రాంప్ట్ ఇంజినీర్లకు ఏడాదికి రూ. 4 లక్షల ప్యాకేజీ లభిస్తోంది.