AI Skills For IT Job :ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో ఉద్యోగాలు పోతాయని కొందరు వాదిస్తుంటే, మరికొందరు మాత్రం ఇది కొత్త అవకాశాలు సృష్టిస్తుందని చెబుతున్నారు. ఏఐ నైపుణ్యాలు అందిపుచ్చుకుంటే, మంచి ఉద్యోగ అవకాశాలు, భారీ జీతాలు అందుకోవచ్చని సూచిస్తున్నారు. దిగ్గజ దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సీటీఓ రఫీ తరఫ్దార్ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు.
కృత్రిమ మేధ (ఏఐ)ను సమర్థవంతంగా అర్థం చేసుకోగలిగిన వారి భవిష్యత్ చాలా బాగుంటుందని రఫీ తరఫ్దార్ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్న యువ ఇంజినీర్లు ఏఐ టూల్స్‌పై అవగాహన పెంచుకోవడం చాలా అవసరమని ఆయన సూచించారు.
ఏఐ స్కిల్స్ ఉండాల్సిందే!
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రఫీ తరఫ్దార్, విద్యార్థులకు కొన్ని కీలకమైన సూచనలు చేశారు. ‘ప్రస్తుతం జాబ్ వరల్డ్ రెండు విభాగాలుగా ఉంది. ఒక విభాగంలో ఏఐ సృష్టికర్తలు ఉంటే, మరోదానిలో ఏఐ వినియోగదారులు ఉన్నారు. అందుకే దాదాపు అన్ని కంపెనీలు ఈ రెండు విభాగాల్లో ఉన్న సమర్థులైన అభ్యర్థుల కోసం ఎదురుచూస్తున్నాయని రఫీ తరఫ్దార్ తెలిపారు.
'సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చేవాళ్లు ఏఐ టెక్నాలజీని సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. అప్పుడే తమ ఏఐ స్కిల్స్‌తో మరింత ఉత్పాదకతను పెంచగలుగుతారు. ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చివారు ఏఐ సృష్టికర్తలుగా మారాలి. ఇందుకోసం తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటా ఉండాలి. అప్పుడే కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయగలుగుతారు. కస్టమర్లకు కావాల్సిన సేవలు అందించగలుగుతారు' అని రఫీ తరఫ్దార్ అన్నారు.