Credit Score Went Down After Paying Off Card :క్రెడిట్ స్కోర్ ఎందుకు పెరుగుతుంది? ఎందుకు తగ్గుతుంది? అనే దానిపై చాలా మందికి అపోహలు ఉంటాయి. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్‌ను పూర్తిగా చెల్లించాక, వెంటనే క్రెడిట్ స్కోర్ పెరిగిపోతుందని చాలా మంది భావిస్తారు. వాస్తవానికి అందుకు భిన్నంగా జరుగుతుంది. అప్పును కట్టేశాక, తాత్కాలికంగా క్రెడిట్ స్కోర్ తగ్గుముఖం పడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక చాలామంది ఆందోళనకు గురవుతుంటారు.
అది గొప్ప ఆర్థిక విజయమే అయినా?
అప్పులను తీర్చడం అనేది ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణంలో గొప్ప ఆర్థిక విజయం. వాస్తవానికి ఇది అత్యంత సానుకూల అంశం. ఇంత గొప్ప విజయాన్ని సాధించినా, చాలామందికి క్రెడిట్ స్కోర్ డౌన్ అయిపోతుంటుంది. దీంతో అప్పు కట్టినా ఎందుకిలా జరిగింది? అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇటువంటి తరుణంలో మనం ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. క్రెడిట్ స్కోరును నిర్ణయించే క్రమంలో అప్పులను తిరిగి చెల్లించే అంశంతో పాటు, ఇంకా చాలా అంశాలను క్రెడిట్ బ్యూరో పరిగణనలోకి తీసుకుంటుంది. అవేంటో చూద్దాం.
క్రెడిట్ స్కోరును డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఇవే!
- పేమెంట్ హిస్టరీ : మీరు అప్పును తిరిగి చెల్లించారు సరే. కానీ మొత్తంగా మీ రీపేమెంట్ హిస్టరీ ఎలా ఉంది? అనేది కూడా క్రెడిట్ బ్యూరో చెక్ చేస్తుంది. మీరు లేట్ పేమెంట్స్ చేసినా, చెక్ బౌన్సులు చేసినా, అవి నెగెటివ్ అంశాలుగా మారి మీ క్రెడిట్ స్కోరును తగ్గించేస్తాయి. సకాలంలో పేమెంట్స్ చేసి ఉంటే, మీ క్రెడిట్ స్కోరు చెక్కుచెదరదు.
- క్రెడిట్ వినియోగం :ప్రత్యేకించి క్రెడిట్ కార్డు వాడే వాళ్లు ఈ పాయింట్‌ను గుర్తుంచుకోవాలి. మీ కార్డుకు బ్యాంకు కేటాయించిన క్రెడిట్ పరిమితిని, మీరు అందులో ఉపయోగించిన మొత్తానికి గల నిష్ఫత్తిని క్రెడిట్ బ్యూరో నిశితంగా పరిశీలిస్తుంది. దీని ఆధారంగానూ మీ సిబిల్ స్కోరులో హెచ్చుతగ్గులు జరుగుతాయి.
- క్రెడిట్ చరిత్ర పరిధి : మీ లోన్ అకౌంట్ల, క్రెడిట్ కార్డ్ అకౌంట్ల (యావరేజ్ ఏజ్) సగటు వయస్సును క్రెడిట్ బ్యూరోలు పరిగణనలోకి తీసుకుంటాయి.
- కొత్త క్రెడిట్ : మీరు ఇటీవల కాలంలో ఎన్ని రుణ ఖాతాలను తెరిచారు? ఎన్ని క్రెడిట్ కార్డులను తీసుకున్నారు? అనేది మూల్యాంకనం చేస్తారు.
- క్రెడిట్ మిక్స్ : మీపై ఉన్న వివిధ రకాల లోన్స్ భారాన్ని క్రెడిట్ బ్యూరోలు విశ్లేషిస్తాయి.
అప్పును చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ ఎలా ప్రభావితమవుతుంది?
- క్రెడిట్ యుటిలైజేషన్ నిష్ఫత్తి పెరుగుదల : క్రెడిట్ కార్డ్ అకౌంటును మూసివేయిస్తే లేదా దాని బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లిస్తే, మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తి పెరుగుతుంది.
- క్రెడిట్ హిస్టరీ సగటు వయసు డౌన్ :పాత రుణ అకౌంట్లను క్లోజ్ చేయడం వల్ల మీ క్రెడిట్ హిస్టరీకి సంబంధించిన సగటు వయస్సు తగ్గిపోతుంది. దీనివల్ల కూడా క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది.
- వైవిధ్య రుణ ఖాతా తొలగింపు : ఒక రుణ ఖాతాను మీరు క్లోజ్ చేస్తే, మీ క్రెడిట్ హిస్టరీ నుంచి ఒక విభిన్న రకానికి చెందిన రుణ మాధ్యమం తొలగిపోతుంది. దీనివల్ల కూడా క్రెడిట్ స్కోరు తగ్గుతుంది.
- క్రెడిట్ నివేదికల రూపకల్పనలో జాప్యం : క్రెడిట్ బ్యూరోలు తమ నివేదికలను ప్రతి 30 నుంచి 45 రోజులకోసారి అప్‌డేట్ చేస్తుంటాయి. ఈ కారణం వల్ల కూడా మీరు రుణం చెల్లించిన వెంటనే క్రెడిట్ స్కోరులో మార్పులు ప్రతిబింబించకపోవచ్చు.
- లేట్ పేమెంట్స్, రుణ దరఖాస్తులు : మీ రుణాలకు సంబంధించిన లేట్ పేమెంట్స్ ఎక్కువగా ఉన్నా, రుణాల కోసం ఎక్కువగా దరఖాస్తులు పెట్టుకున్నా మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది.