What Is Dividend :షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని చాలా నమ్ముతారు. షేర్లు అమ్మడం, కొనటం ద్వారా లాభాలు పొందవచ్చని భావిస్తారు. టాప్ కంపెనీల, లాభాల్లో నడుస్తున్న సంస్థల షేర్లు కొని, అవి కాస్త లాభాల్లోకి వచ్చిన తర్వాత అమ్మేస్తుంటారు. అయితే డివిడెండ్ల ద్వారా కూడా షేర్ మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చు. అది ఎలాగో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
షేర్ మార్కెట్ గురించి తెలిసినవారికి, అందులో పెట్టుబడులు పెట్టేవారికి 'డివిడెంట్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా మదుపరులు మార్కెట్లో షేర్లు అమ్మడం, కొనటం ద్వారా లాభాలు సంపాదించాలని చూస్తారు. కానీ డివిడెండ్ల రూపంలోనూ రాబడి పొందవచ్చు. అంతేకాదు షేర్ హోల్డర్లు తమకు వచ్చిన డివిడెండ్‌ను రీ-ఇన్వెస్ట్ చేసి అదనపు ఆదాయాన్ని సంపాదించేందుకు కూడా అవకాశముంది.
ఇంతకీ డివిడెండ్ అంటే ఏమిటి?
కంపెనీలు తమకు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని షేర్ హోల్డర్లకు పంచుతాయి. వీటినే డివిడెండ్లు అని అంటారు. అయితే ఇది ఆ స్టాక్ వాల్యూ, షేర్ల సంఖ్యను బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా ఈ డివిడెండ్ల పంపిణీ కోసం ఒక విధానం అంటూ ఏమీ ఉండదు. నెల, 3 నెలలు, 6 నెలలు లేదా వార్షిక ప్రాతిపదికన డివిడెండ్లను చెల్లిస్తూ ఉంటాయి. డివిడెండ్ పేమెంట్ విషయంలో అనౌన్స్మెంట్ డేట్, ఎక్స్-డివిడెండ్ డేట్, రికార్డు డేట్, పేమెంట్ డేట్లు ఉంటాయి. దీని వల్ల మదుపరులకు మంచి రాబడి వస్తుంది. పైగా సదరు స్టాక్ రిలయబిలిటీని, పొటెన్షియల్‌ని అంచనా వేయడానికి కూడా వీలవుతుంది.
ఇదే కాకుండా, డివిడెంట్ ద్వారా అదనపు డబ్బు కూడా సంపాదించవచ్చు. అది ఎలా అంటే, కంపెనీలు ఇచ్చిన డివిడెండ్‌ను, రీ-ఇన్వెస్ట్ చేస్తే, భవిష్యత్లో మీకు మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే, డివిడెంట్ అనేది ఒక రివార్డు. కంపెనీలు ఈ డివిడెండ్లను నగదు రూపంలోకానీ, స్టాక్స్ రూపంలో కానీ ఇస్తుంటాయి. అయితే కంపెనీ డివిడెండ్‌ను ప్రకటించాలంటే, ముందుగా దాని బోర్డు డైరెక్టర్లు, షేర్ హోల్డర్ల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.