తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎలాంటి గొడవలు లేకుండా ఆస్తులు పంచిపెట్టాలా? వీలునామా రాయండిలా! - How To Prepare Will Deed

How To Prepare Will Deed : మీరు బాగా ఆస్తులు సంపాదించారా? వాటిని ఎలాంటి గొడవలు లేకుండా, వాటిని మీ వారసులకు పంచాలని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. వీలునామా ద్వారా మీ చర, స్థిరాస్తులను మీ వారసులకు పంచవచ్చు. అయితే ఇది ఎలా రాయాలి? ఇందులో ఎవరెవరి సంతకాలు ఉండాలి? దీనికి చట్టబద్ధత లభించాలంటే ఏం చేయాలి? మొదలైన విషయాలు ఇప్పుడు సమగ్రంగా తెలుసుకుందాం.

How To Prepare Will Deed?
What is will deed? (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 4:55 PM IST

How To Prepare Will Deed : ఎవరికైనా మరణం తప్పదు. మరణం తర్వాత ఆస్తులు, అప్పుల విభజన సాఫీగా జరగాలంటే ముందస్తుగా వీలునామాను రెడీ చేసుకోవడం తప్పనిసరి. వీలునామా అనేది చట్టపరమైన పత్రం. దీని ఆధారంగానే ఒక వ్యక్తి మరణానంతరం అతడి ఆస్తులను వారసులకు పంపిణీ చేస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది వారసులను కలిగినవారు తప్పనిసరిగా వీలునామా రాస్తే మంచిది. దీనివల్ల వారసుల మధ్య పరస్పర ఘర్షణలను ఆపొచ్చు. చట్టపరమైన పోరాటాల దాకా సమస్య పెరగకుండా నిలువరించవచ్చు. వీలునామాపై మరిన్ని వివరాలివీ.

ఆ విషయాలపై ఫుల్ క్లారిటీ
వీలునామాలో ఆస్తులు, అప్పుల వివరాలు ఉంటాయి. ఆస్తుల జాబితాలో నగదు, భూములు, భవనాలు, ఆభరణాలు, కుటుంబ వారసత్వ సంపద, బీమా, బ్యాంకు డిపాజిట్లు, స్టాక్స్‌/మ్యూచువల్‌ ఫండ్లు ఉంటాయి. ఇవన్నీ ఏ వ్యక్తులకు చెందాలి? ఏ సంస్థలకు చెందాలి? అనేది ఆ ఆస్తి యజమాని నిర్ణయించవచ్చు. వారసులకు ఆస్తులను పంచడంలో వీలునామాలో నామినీగా ఉన్న వ్యక్తి కీలక పాత్ర పోషిస్తాడు. ఒకరి కంటే ఎక్కువ మంది వారసులు ఉన్నప్పుడు, ఆస్తులను ఉమ్మడి నిర్వహణ కోసం వదిలితే ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే అలాంటి ఆస్తులను ఎలా విభజించుకోవాలి? అనే దానిపై వీలునామాలో స్పష్టంగా ప్రస్తావించాలి.

ఎగ్జిక్యూటర్ నియామకం
కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి పేరు, చిరునామా, వయసు సమాచారాన్ని వీలునామాలో ఎగ్జిక్యూటర్‌ (కార్యనిర్వాహకుడి)‌గా చేర్చాలి. ఆస్తి అసలు యజమాని చనిపోయాక, వీలునామా ప్రకారం అతడి ఆస్తుల పంపిణీ ప్రక్రియను అమలు చేసేది ఎగ్జిక్యూటరే. వీలునామా ప్రకారం రుణాలు, బాధ్యతలు, పన్నులు, రుసుములు అన్నీ వారసులకు అప్పగించేది ఇతడే.

సాక్షులు కీలకం!
వీలునామా రాసే వ్యక్తిని టెస్టేటర్ అంటారు. వీలునామా రాసిన తర్వాత ఇద్దరు నమ్మకమైన వ్యక్తులతో సాక్షి సంతకాలు చేయించాలి. ఎవరి ప్రలోభాలకు గురికాకుండా వీలునామా రాసినట్లుగా ఆ సాక్షులు ధ్రువీకరించాలి. లీగల్ ల్యాంగ్వేజ్‌లో వీరిని 'అటెస్టింగ్‌ విట్నెస్' అంటారు. కుటుంబానికి సన్నిహితంగా ఉండే న్యాయవాదులు, డాక్లర్లు, సీఏలను కూడా అటెస్టింగ్‌ విట్‌నెస్‌గా పరిగణించవచ్చు. అందులో సాక్షులకు సంబంధించిన పేరు, చిరునామా, టెలిఫోన్‌ నంబర్‌ను పొందుపర్చాలి. వీలునామా రాసే వ్యక్తి పెద్ద వయసులో ఉంటే, రిజిస్టర్డ్ డాక్టర్‌ నుంచి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ పొందాలి. దాన్ని వీలునామాకు జతపర్చాలి. వీలునామా రాసిన వ్యక్తి, దాన్ని తన మరణానికి ముందు ఎప్పుడైనా మార్చవచ్చు లేదా రద్దు చేయొచ్చు.

వీడియో తీయాలా?
వీలునామాను చేతితో రాయొచ్చు. తెల్లటి పేపర్‌పై టైప్‌ చేయొచ్చు. వీలునామాలో సంతకంతో పాటు తేదీ ఉండాలి. వీలునామా పత్రాలలోని ప్రతి పేజీలో వీలునామా రాసే వ్యక్తి సంతకం ఉండాలి. వీలునామాలో ఎప్పుడైనా మార్పులు చేస్తే, మళ్లీ సాక్షులు కూడా సంతకం చేయాలి. వీలునామా రాసేటప్పుడు సాక్షుల సమక్షంలో వీడియోగ్రఫీ తీయించడం బెటరే. దీనివల్ల భవిష్యత్తులో వీలునామాను ఎవరూ సవాలు చేయలేరు. వీలునామాకు సంబంధించిన ఒక కాపీని కుటుంబ న్యాయ సలహాదారు దగ్గర ఉంచాలి.

చట్టబద్ధంగా వీలునామా చెల్లాలంటే?
హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు తయారుజేసే వీలునామా భారతీయ వారసత్వ చట్టం- 1925లోని నిబంధనల ప్రకారం అమలవుతుంది. వీలునామాను రాసిన తర్వాత, దాన్ని రిజిస్ట్రార్ ఆఫీస్‌లో నమోదు చేయాలి. దీంతో అది చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ వీలునామా ట్యాంపరింగ్‌కు గురైందనే సందేహం వస్తే, అసలు కాపీ కోసం రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఇతర వారసులు కాంటాక్ట్ చేయొచ్చు. ఒక వ్యక్తి స్వచ్ఛంద సంస్థలకు బహుమతులు, విరాళాలను కూడా వీలునామా ద్వారా ప్రకటించవచ్చు. ఇక వీలునామాను సవాలు చేయడం అనేది సుదీర్ఘమైన, ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. దాని కంటే అవతలి పక్షంతో చర్చలు జరిపి సెటిల్మెంట్‌ చేసుకోవడం మంచిదని న్యాయ నిపుణులు చెబుతుంటారు.

మీ జీవిత బీమా పాలసీని సరెండర్‌ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! - Life Insurance Policy Surrender

ఆగస్టులో లాంఛ్ కానున్న టాప్​-8 కార్స్ ఇవే! ఫీచర్స్ అదుర్స్ - ధర ఎంతో తెలుసా? - Cars Launching In August 2024

ABOUT THE AUTHOR

...view details