Ways To Check Your SBI Account Balance :స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ ఖాతాదారులకు కావాల్సిన సమాచారాన్ని, సేవల్ని వేగంగా అందించేందుకు పలు ఆన్‌లైన్ సేవలను అందిస్తోంది. వీటిని ఉపయోగించుకుంటే, క్యూలైన్లలో గంటల తరబటి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఒకప్పుడు మన అకౌంట్లో ఎంత సొమ్ము ఉందో తెలుసుకోవడానికి కూడా క్యూలైన్లో నిలబడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆన్లైన్లో క్షణాల్లోనే మనకు కావాల్సిన సమాచారం అంతా తెలుసుకోవచ్చు.
ఖాతాదారులు ప్రధానంగా అకౌంట్ బ్యాలెన్స్ గురించి చెక్ చేసుకుంటా ఉంటారు. అందుకేఎస్బీఐ తమ ఖాతాదారులు అకౌంట్లోని బ్యాలెన్స్ తెలుసుకునేందుకు పలు అవకాశాలు కల్పిస్తోంది. ఎస్ఎంఎస్, ఆన్‌లైన్, వాట్సప్ ఇలా వివిధ మాధ్యమాల ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
మిస్డ్ కాల్ బ్యాంకింగ్?
మిస్డ్ కాల్ బ్యాంకింగ్ సర్వీస్ ద్వారా ఎస్‌బీఐ ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవచ్చు. అయితే, ఈ సర్వీస్ పొందడానికి ముందే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
- ముందుగా మీ ఫోన్‌లోని మెసేజ్ యాప్ తెరవాలి.
- REG ఖాతా నంబర్ టైప్ చేయాలి.
- 09223488888కు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి సందేశం పంపాలి. అంతే సింపుల్!
- మీ ఎస్‌బీఐ మిస్డ్ కాల్ బ్యాంకింగ్ సర్వీస్ యాక్టివేట్ అయిపోతుంది.
- ఇప్పుడు బ్యాంకు మీకు రెండు ఆప్షన్లను ఇస్తుంది.
- బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు, మినీ స్టేట్‌మెంట్ పొందేందుకు రెండు వేర్వేరు టోల్‌ఫ్రీ నంబర్లను అందిస్తుంది.
ఎస్‌బీఐ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి - 9223766666
9223866666 నంబర్‌కు కాల్ చేస్తే ఎస్‌బీఐ ఖాతా ద్వారా చేసిన చివరి 5 లావాదేవీల సమాచారం తెలుస్తుంది.
వాట్సప్ ద్వారా
వాట్సాప్ బ్యాంకింగ్ కింద ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు పలు రకాల సేవలను, వివరాలను అందిస్తోంది. ఈ మాధ్యమం ద్వారా మీ ఖాతాలోని బ్యాలెన్స్ కూడా తెలుసుకోవచ్చు.
- +919022690226 నంబర్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి.
- వాట్సప్‌లో పై నంబర్‌కు 'Hi' అని మెసేజ్ చేయాలి.
- కనిపించే వివిధ రకాల ఆప్షన్లలో గెట్ బ్యాలెన్స్‌పై క్లిక్ చేయాలి.
- వెంటనే మీకు కావాల్సిన సమాచారం అంతా మీ ముందుంటుంది.