Upcoming Cars In India 2024 : మీరు కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. 2024-25లో బోలెడు లేటెస్ట్ మోడల్ కార్లు ఇండియన్ మార్కెట్లో లాంఛ్ కానున్నాయి. వీటిలో తక్కువ బడ్జెట్ కార్ల నుంచి ప్రీమియం మోడల్స్ వరకు అన్నీ ఉన్నాయి. వీటిలో స్టన్నింగ్స్ ఫీచర్స్, సైలిష్ డిజైన్, మంచి మైలేజ్ ఇచ్చే టాప్-10 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Maruti New Dzire :మారుతి సుజుకి కంపెనీ నంబర్ నెలలో న్యూ డిజైర్ కారును మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ధర బహుశా రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల రేంజ్‌లో ఉండవచ్చని అంచనా. పెట్రోల్‌తో నడిచే ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ కాంపాక్ట్ సెడాన్ కారులో అనేక ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ మార్పులు చేశారు. ఇంజిన్ విషయానికి వస్తే, ఈ కారులో 1.2 లీటర్, త్రీ-సిలిండర్, జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 80bhp పవర్, 112Nm టార్క్ జనరేట్ చేస్తుంది. సీఎన్‌జీ-ఎనేబుల్డ్ మోడల్ అయితే 69 bhp పవర్, 102Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారులో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. అలాగే ఏబీఎస్ విత్ ఈబీడీ ఉంటుంది. కనుక సేఫ్టీ పరంగా ఈ మారుతి న్యూ డిజైర్ చాలా బాగుంటుంది.
2. Tata Avinya : టాటా అవిన్య బహుశా 2025 జూన్‌లో మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ కారు ధర సుమారుగా రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉండవచ్చు. ఈ కారు మినిమం రేంజ్ 500 కి.మీ ఉంటుందని సమాచారం. అంతేకాదు ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 30 నిమిషాల లోపే ఫుల్ ఛార్జ్ అవుతుందని తెలుస్తోంది. మార్కెట్లో ప్రస్తుతానికి దీనికి పోటీని ఇచ్చే రైవల్ కారు అనేది ఏదీ లేదు.
3. Honda WR-V :ఈ హోండా కారు బహుశా 2026 మార్చి నెలలో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల రేంజ్‌లో ఉండవచ్చు. ఈ హోండా కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని సమాచారం. మార్కెట్లో దీనికి నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్, కియా సోనెట్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ 300, మారుతి సుజుకి బ్రెజ్జా నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.
4. Renault Duster : రెడో డస్టర్ 2025 జూన్‌లో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. ఈ కారు ధర సుమారుగా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది. ఈ ఎస్‌యూవీ కారు 2 ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. అవి: 1.6 లీటర్ పెట్రోల్-హైబ్రిడ్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఈ కారుకు మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది.
5. Nissan Magnite Facelift : నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ఈ అక్టోబర్‌లోనే లాంఛ్ కానుంది. ఈ కారు ధర సుమారుగా రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల ప్రైస్ రేంజ్‌లో ఉంటుందని అంచనా. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో 1.0 లీటర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 99 bhp పవర్, 160 Nm టార్క్ జనరేట్ అవుతుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా సీవీటీతో అనుసంధానం అయ్యుంటుంది. దీనిలో డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే యూనిట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, సింగిల్-పేన్ సన్‌రూఫ్ ఉంటాయని సమాచారం. ఇక సేఫ్టీపరంగా చూస్తే, ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. అలాగే దీనిలో ప్రస్తుత మోడల్స్‌లో ఉన్నట్లుగానే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ), ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్ విత్ కెమెరా, హిల్ స్టార్ట్ అసిస్ట్, టీపీఎంఎస్ కూడా ఉండవచ్చు.
6. Skoda Kylaq :స్కోడా కైలాక్ బహుశా 2025 మార్చి నెలలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర బహుశా రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉండవచ్చు. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో 1.0 లీటర్ టీఎస్‌ఐ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 114 bhp పవర్, 178 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.
7. Kia Carnival :ఈ అక్టోబర్ నెలలోనే కియా కార్నివాల్ ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర సుమారుగా రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు ఉంటుందని అంచనా. డీజిల్‌తో నడిచే ఈ బండిలో 2151 సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 190 bhp పవర్, 441 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీనిని 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానం చేశారు. ఈ కియా కార్నివాల్‌ను MVP స్టైలింగ్ నుంచి SUV స్టైలింగ్‌కు మార్చినట్లు సమాచారం. సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కియా కార్నివాల్‌లో లెవెల్-2 ఏడీఏఎస్ విత్ 21 ఫీచర్స్ ఉన్నాయి. అలాగే దీనిలో 8 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉంటాయి.
8. Mercedes-Benz New E-Class : మెర్సిడీస్-బెంజ్ న్యూ ఈ-క్లాస్ ఈ అక్టోబర్‌లోనే లాంఛ్ అయ్యే ఛాన్స్ ఉంది. మార్కెట్లో దీని ధర రూ.80 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు ఉంటుంది. దీనిలోని E200 పెట్రోల్ ఇంజిన్ 194 bhp పవర్, 320 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. డీజిల్-పవర్డ్ E 220d ఇంజిన్ 197 bhp పవర్, 440 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు టెక్ సిల్వర్, గ్రాఫైట్ గ్రే, అబ్సిడియన్ బ్లాక్, పోలార్ వైట్, నాటిక్ బ్లూ అనే 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
9. Kia EV9 : కియా ఈవీ9 కారు 2024 అక్టోబర్‌లోనే లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ.90 లక్షల నుంచి రూ.1.20 కోట్లు వరకు ఉంటుంది. ఇది ఒక త్రీ-రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఈ కారులో 99.8 కిలోవాట్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 561 కి.మీ రేంజ్ వరకు ప్రయాణం చేయవచ్చు. దీని టాప్ స్పీడ్ గంటకు 200 కి.మీ ఉంటుందని సమాచారం.
10. Volkswagen Virtus GT Plus Sport : ఈ ఫోక్స్‌వ్యాగన్ వర్చూస్ జీటీ ప్లస్ స్పోర్ట్ కారు ఈ 2024 డిసెంబర్‌లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర బహుశా రూ.19.38 లక్షలు ఉంటుందని సమాచారం. ఈ కారులో 1498 సీసీ, ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 148 bhp పవర్, 250 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది లీటర్‌కు 19.62 కి.మీ మైలేజ్ ఇస్తుందని సమాచారం. ఈ కారు 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.