Union Budget 2025 Highlights : పేద మధ్యతరగతి ఆశలను మోస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో 2025-26 సవంత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. త్వరిత, సమ్మిళిత అభివృద్ధి, పెట్టుబడుల సాధన లక్ష్యంగా ఈ బడ్జెట్ తీసుకొచ్చామని సీతారామన్ ప్రకటించారు. ఈ బడ్జెట్లో పన్ను సంస్కరణలు, మౌలిక వసతుల కల్పన, పెట్టబడులు, ఉపాధి కల్పన వంటి అంశాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. పన్ను సంస్కరణల్లో భాగంగా కొత్త ట్యాక్స్ స్లాబ్‌లను ప్రకటించింది. రూ.12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారిని పన్ను నుంచి మినాహాయించింది. వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలపై కేంద్ర దృష్టి పెడుతూనే అన్ని రంగాల్లో సమతౌల్యత, వ్యవస్థాపకత పెంపొందించడం, మధ్యతరగతికి సాధికారత కల్పించేలా బడ్జెట్‌ను రూపొదించింది. ఈ 2025 బడ్జెట్లో కీలక అంశాలు ఇవే.
మౌలిక వసతుల కల్పన
- ఐఐటీలను విస్తరించడం : 6500 మంది విద్యార్థుల విద్యావకాశాలు కల్పించేలా 2014 తర్వాత ఏర్పాటైన ఐదు ఐఐటీల్లో మౌలిక వసతులను ప్రభుత్వం మెరుగుపరచనుంది. ఐఐటీ పాట్నాలో మొదటగా అభివృద్ధి పనులు చేస్తారు.
- రిజినల్ కనెక్టివిటీ :సవరించిన ఉడాన్ పథకం ద్వారా మరో 120 ప్రాంతాలకు విమాన సౌకర్యాన్ని విస్తరిస్తారు. తద్వారా వచ్చే నాలుగేళ్లలో విమాన ప్రయాణికుల రద్దీ నాలుగు రెట్లు పెరుగుతుంది. ఇది ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాల్లో ఉన్న విమానాశ్రయాల అభివృద్ధికి దోహదం చేస్తుంది.
- బిహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు కేంద్రం సహాయం. పట్నా ఎయిర్‌పోర్టు, బిహ్టా ఎయిర్‌పోర్టుల విస్తరణ.
- రాబోయే 5 సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలల్లో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను కేంద్రం ఏర్పాటు చేయడం.
- భారత్‌నెట్ ప్రాజెక్ట్ కింద గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించడం.
- విద్యా రంగంలో ఆర్టఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ సంస్థను ఏర్పాటు చేయడం. దీని కోసం రూ.500 కోట్లు ఖర్చు చేయడం.
- మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రాలకు మద్దతు - మూలధన పెట్టుబడి, సంస్కరణల కోసం 50ఏళ్ల వడ్డీ లేని రుణాల కోసం రూ.1.5 లక్షల కోట్లు ప్రతిపాదన
- చిన్న మాడ్యులర్ రియాక్టర్ల (SMR) పరిశోధన, అభివృద్ధి కోసం రూ.20,000 కోట్ల వ్యయంతో అణుశక్తి మిషన్ ఏర్పాటు. తద్వారా 2033 నాటికి దేశీయంగా అభివృద్ధి చేయబడిన 5 SMRలు పనిచేయనున్నాయి.
- స్వామి నిధి 2 - ప్రభుత్వం, బ్యాంకులు, ప్రైవేట్ పెట్టుబడిదారుల సహకారంతో మరో లక్ష డ్వెల్లింగ్ యూనిట్లను త్వరగా పూర్తి చేయడం లక్ష్యంగా రూ.15,000 కోట్లు కేటాయింపు
- అంతర్జాతీయ వాణిజ్యం ఏకీకృత ట్రేడ్ డాక్యుమెంటేషన్, ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ కోసం భారత్ ట్రేడ్నెట్ను ఏర్పాటు చేయడం
పన్ను సంస్కరణలు
- పన్ను చెల్లింపులు సులభతరం చేసేందుకు ట్యాక్స్ స్లాబ్‌లను కేంద్రం సవరించింది. సవరించిన పన్ను స్లాబ్స్ ఇవే
సవరించిన పన్ను స్లాబ్స్ (FY 2025-26) | |
రూ.0-4 లక్షలు | నిల్ |
రూ.4-8 లక్షలు | 5 శాతం |
రూ.8-12 లక్షలు | 10 శాతం |
రూ.12-16 లక్షలు | 15 శాతం |
రూ.16-20 లక్షలు | 10 శాతం |
రూ20- 24 లక్షలు | 25 శాతం |
రూ.24 లక్షలకు పైగా | 30 శాతం |
- ఎంత పన్ను ఆదా చేసుకోవచ్చు?
ఆదాయం | పొదుపు | ఎఫెక్టివ్ రేటు |
రూ. 12 lakh | రూ. 80,000 | 0 శాతం |
రూ. 16 lakh | రూ. 50,000 | 7.5 శాతం |
రూ. 20 lakh | రూ. 90,000 | 10 శాతం |
రూ. 50 lakh | రూ 1.1 lakh | 21.6 శాతం |
- ద్రవ్య లోటు: ద్రవ్యలోటు GDPలో 4.4 శాతంగా ఉంటుందని అంచనా
డిజిటల్ ఎకానమీ, ఇన్నోవేషన్
- స్టార్టప్‌ల కోసం రూ.10 వేల కోట్ల ఫండ్ ఆఫ్ ఫండ్ ఏర్పాటు. స్టార్టప్‌ల ఇన్కార్పోరేషన్ సమయం ఐదేళ్లకు పెంపు
- సూక్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల- ఎమ్ఎస్ఎమ్ఈ కంపెనీలకు రూ.10కోట్ల కవరేజ్ పెంపు
- ఉద్యం పోర్టల్‌లో రిజిస్టర్ అయిన సూక్ష్మ కంపెనీలకు రూ.5 లక్షల లిమిట్‌తో క్రెడిట్ కార్డులు జారీ చేయడం. మొదటి సంవత్సరంలో 10 లక్షల కార్డులు జారీ చేస్తారు.