Types Of Term Insurance :టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల గురించి చాలా మంది చెబుతుంటారు. అయితే వాటిని అర్థం చేసుకోవడంలో జనం బాగా గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఎందుకంటే మార్కెట్లో రకరకాల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో మన కుటుంబ ఆర్థిక భద్రతకు సరిపోయే పాలసీ ఏది? అనే విషయం తెలుసుకోవడం కీలకం. అందుకే ఈ కథనంలో వివిధ రకాల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు, వాటి వల్ల పాలసీదారులకు కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
టర్మ్ ఇన్సూరెన్స్ అంటే?
టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఒక నిర్ణీత కాలం కోసం తీసుకునే జీవిత బీమా పాలసీ. బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి, నిర్ణీత వ్యవధిలో చనిపోతే, అతడి కుటుంబీకులు బీమా పరిహారాన్ని పొందుతారు. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది జీవిత బీమా పాలసీ కంటే భిన్నమైంది. టర్మ్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించే మొత్తంలో కొంత భాగాన్ని పాలసీదారుడు వెనక్కి పొందే అవకాశం ఉండదు.
లెవల్ టర్మ్ ఇన్సూరెన్స్
Level Term Insurance :లెవల్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది టర్మ్ ఇన్సూరెన్స్‌లో అత్యంత సాధారణ రకం. ఈ పాలసీ తీసుకున్నవారు నిర్ణీత కాలవ్యవధికి ప్రీమియం సకాలంలో చెల్లించాలి. ఈ టైంలో పాలసీదారుడికి ఏదైనా జరగరానిది జరిగితే, నిర్ణీత మొత్తాన్ని అతడి కుటుంబానికి బీమా పరిహారంగా అందిస్తారు. ఈ పాలసీ ఆర్థిక స్థిరత్వం, మనశ్శాంతిని అందిస్తుంది. ఈ పాలసీలో 'లెవల్' అనే పదాన్ని 'రీపేమెంట్'కు పర్యాయ పదంగా పరిగణించవచ్చు.
ఇంక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్
Increasing Term Insurance :ఇంక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అదనపు ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఈ పాలసీ గడువు ముగిసేలోగా బీమా కవరేజీ నిర్ణీత మొత్తంలో పెరుగుతుందని ముందే హామీ ఇస్తారు. అయితే బీమా కవరేజీ ఎంతమేర పెరగాలి? అనేది పాలసీదారుడు తన ఆర్థిక అవసరాలు, నష్టాన్ని భరించే శక్తి, ద్రవ్యోల్బణం రేటును బట్టి నిర్ణయించుకోవచ్చు.
డిక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్
Decreasing Term Insurance :డిక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ కొంత చౌకైనది. లెవల్ టర్మ్ ఇన్సూరెన్స్‌తో పోలిస్తే ఇది చౌకే. ఈ పాలసీ తీసుకుంటే మనకు లభించే బీమా కవరేజీ విలువ ప్రతి ఏటా క్రమంగా తగ్గుతూపోతుంది. అందుకు తగ్గట్టే, మనం పాలసీ కోసం చెల్లించే మొత్తం కూడా తగ్గిపోతుంది. భవిష్యత్తులో మనపై ఆర్థికభారం తగ్గాలని భావిస్తే, ఈ రకం పాలసీలు బెస్ట్. అప్పులు, ఇతర ఆర్థిక బాధ్యతలు ఎక్కువగా ఉన్నవారికి ఈ పాలసీ ఉపయోగకరం.