Home Insurance Questions :సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితకాల స్వప్నం. సగటు మనిషి జీవితంలో తీసుకునే అతిపెద్ద ఆర్థిక నిర్ణయం కూడా ఇదే. చెమటోడ్చి సంపాదించి కూడబెట్టిన డబ్బుతో ఇల్లు కొంటాం లేదా కట్టుకుంటాం. అలాంటి ఇంటిని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు హోం ఇన్సూరెన్స్చేయించుకోవడం అత్యవసరం. దొంగతనాలు, అగ్ని ప్రమాదాలు, ఊహించని ఇతర విపత్తులు ఎదురైన సమయంలో మన ఇంటికి హోం ఇన్సూరెన్స్ భరోసాగా నిలుస్తుంది. అయితే హోం ఇన్సూరెన్స్ పాలసీని గుడ్డిగా తీసుకోవడం సరికాదు. దానికి సంబంధించి మనకు ఉండే సందేహాలను, కవరేజీతో ముడిపడిన షరతుల వివరాలను సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన ఏజెంట్‌ను అడిగి తెలుసుకోవాలి. ప్రత్యేకించి తొలిసారి ఇంటికి ఇన్సూరెన్స్ చేయిస్తున్న వారు దీన్ని ఫాలో కావాలి. అందుకే హోమ్ లోన్ తీసుకోవాలని అనుకునేవారు ఏజెంట్‌ను కచ్చితంగా అడగాల్సిన ప్రశ్నలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హోమ్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌ను అడగాల్సిన కీలక ప్రశ్నలు
1. కవరేజ్ :హోం ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా లభించే కవరేజీ వివరాలను తెలుసుకోవాలి. ఆ పాలసీలో ఏయే రకాల ప్రమాదాలను చేర్చారు? ఏయే రకాల విపత్తులను మినహాయించారు? అనేది అడగాలి. సాధారణంగా అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి వాటికి కవరేజీ లభిస్తుంటుంది. పాలసీ మీ ఇల్లు, వస్తువుల పూర్తి రీప్లేస్‌మెంట్ ఖర్చును కవర్ చేస్తుందా? నగదు విలువను మాత్రమే కవర్ చేస్తుందా? అనేది కూడా తెలుసుకోవాలి. మీరు మరమ్మతుల సమయంలో తాత్కాలికంగా ఇల్లు మారాల్సి వస్తే, ఆ వ్యవధిలో అదనపు జీవన వ్యయాలకు కవరేజీ లభిస్తుందా? అనేది అడిగి తెలుసుకోవాలి. పాలసీ కవరేజీ కోసం ఇంటి వయస్సు, ప్రదేశం వంటి వాటిని ప్రత్యేకంగా పరిగణిస్తున్నారా? అనే ప్రశ్న ఏజెంట్‌ను అడగాలి.
2. ప్రీమియం లెక్కింపు :హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం మీరు చెల్లించే ప్రీమియం వివరాల గురించి ఏజెంట్‌ను అడిగి తెలుసుకోవాలి. ఆ ప్రీమియంను ఎలా లెక్కిస్తారు? అనే విషయం అడగాలి. దీనివల్ల మీ పాలసీ ధరపై ప్రభావం చూపే అంశాలు మీకు అర్థమవుతాయి. సాధారణంగా ఇంటి పరిమాణం, వయస్సు, దాని స్థానం వంటి అంశాలు పాలసీ ప్రీమియం ధరపై ప్రభావం చూపుతాయి. హోమ్ సెక్యూరిటీ సిస్టమ్‌లు, ఫైర్ అలారం ఏర్పాట్లు ఇంట్లో ఉన్నప్పుడు పాలసీ ప్రీమియంలో ఏమైనా డిస్కౌంట్ లేదా క్రెడిట్ లభిస్తుందా అని అడగాలి. ప్రీమియం రేట్లు తరచుగా ఎంత మేర మారుతాయి? అలా మారడానికి ఏయే అంశాలు కారణం అవుతాయి? అనేది ఏజెంట్ ద్వారా తెలుసుకోవాలి. ఇక ప్రీమియంను ఏడాదికోసారి చెల్లించాలా? నెలవారీ వాయిదాల్లోనూ చెల్లించే వెసులుబాటు ఉందా? అనే ప్రశ్నను కూడా వేయాలి.
3. క్లెయిమ్స్ హిస్టరీ : గృహ బీమా పాలసీని తీసుకునేటప్పుడు తప్పకుండా క్లెయిమ్ చేసే పద్దతి గురించి తెలుసుకోవాలి. క్లెయిమ్ చేసే ప్రక్రియ, పరిహారం సెటిల్ అయ్యే వ్యవధి గురించి ప్రశ్నలు అడగాలి. క్లెయిమ్‌లను సెటిల్ చేసే విషయంలో కంపెనీకి ఉన్న ట్రాక్ రికార్డ్ గురించి ఏజెంటు నుంచి సమాచారం రాబట్టాలి. గతంలో ఇలాంటి హోం ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను ఎలా నిర్వహించారు? కస్టమర్ల నుంచి వచ్చిన స్పందన ఏమిటి? అనేది తెలుసుకోవాలి. ఏడాది వ్యవధిలో క్లెయిమ్‌ల సంఖ్యపై పరిమితి ఏమైనా ఉందా? క్లెయిమ్‌ల రకాలపై ఏవైనా పరిమితులు ఉన్నాయా? అనే దానిపై ఏజెంట్‌కు ప్రశ్నలు వేయాలి. క్లెయిమ్స్‌కు అప్లై చేసేటప్పుడు ఏయే డాక్యమెంట్లను సమర్పించాలి అనేది తెలుసుకోవాలి.