Stock market Investment Tips :'షేర్ మార్కెట్‌లో ఎప్పుడూ లాభాలే వస్తాయని చాలా మంది అనుకుంటారు. మార్కెట్ ఎప్పటికీ ఆగదని భావిస్తుంటారు. అందుకే ఈక్విటీల్లో పెట్టుబడులను పెంచుకుంటూ వెళ్తారు. డబ్బుకు సంబంధించినంత వరకు ఇది ఒక పెద్ద అపోహ' అని ఐఐటీ మద్రాస్ ఆచార్యులు ఎం.పట్టాభిరామన్ స్పష్టం చేస్తున్నారు. స్టాక్ మార్కెట్ సూచీలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మదుపరులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నష్టాలపాలు కాకుండా చూసుకోవాలి. అంతేకాదు వచ్చిన లాభాలను కాపాడుకునేందుకు కూడా ఏం చేయాలన్నదీ తెలుసుకోవాలి.
"మనం పెట్టిన పెట్టుబడికి గ్యారెంటీగా రాబడినిచ్చే పథకాలు సహజంగానే అధిక వడ్డీని లేదా ఆదాయాన్ని అందించవు. ఉదాహరణకు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే, ప్రస్తుతానికి గరిష్ఠంగా 7.5 శాతం వరకు మాత్రమే వడ్డీ లభిస్తోంది. ఇక్కడ మీకు వచ్చే రాబడికి కచ్చితమైన హామీ ఉంటుంది. కనుక ఎలాంటి నష్టభయం ఉండదు. కానీ, స్టాక్ మార్కెట్లో పెట్టే పెట్టుబడులకు ఎలాంటి హామీ ఉండదు. మార్కెట్ మంచి భూమ్‌లో ఉంటే, భారీ ఎత్తున లాభాలు వస్తాయి. మార్కెట్లు పడిపోతే, భారీ ఎత్తున నష్టాలు వస్తాయి. అంటే మార్కెట్ స్థితిగతులను బట్టి, లాభనష్టాలు వస్తుంటాయి. అందుకే నష్టాన్ని భరించే శక్తిగలవారు మాత్రమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి.
అన్నీ పెరగవు!
ఈక్విటీ పెట్టుబడులపై వచ్చే లాభాలు మార్కెట్ గమనాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మార్కెట్ పెరుగుతున్నప్పుడు కూడా అన్ని షేర్ల ధరలు పెరగవు. కానీ, మార్కెట్ పడిపోతున్నప్పుడు ఆ ప్రభావం దాదాపు అన్ని షేర్లపైనా ఉంటుంది. కొన్ని షేర్ల ధరలు చాలా వేగంగా పతనం అవ్వడం కూడా చూస్తుంటాం. అందుకే షేర్లలో మదుపు చేసేటప్పుడు ఆ షేరు ధర ఎంత ఆకర్షణీయంగా ఉందనే విషయాన్ని కచ్చితంగా చూడాలి. అంతే కానీ, మార్కెట్ సూచీలు ఎలా ఉన్నాయన్నది కాదు. చాలా మంది మార్కెట్ లాభాల్లో ఉన్నప్పుడే మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మార్కెట్ ర్యాలీ కొనసాగుతున్నప్పుడు ఆ షేరు ధర పెరుగుతోందని సంతోష పడుతుంటారు. కానీ, మార్కెట్ పతనం అయితే, ఆ షేరు ధర ఎంత వేగంగా పతనం అవుతుందనే విషయాన్ని పట్టించుకోరు. దీనితో భారీగా నష్టపోతుంటారు. ఇలా నష్టపోకుండా ఉండాలంటే, ఒక షేరును తక్కువ ధరకు కొనాలి. దానిని అధిక ధర ఉన్నప్పుడు అమ్మాలి. భవిష్యత్ అవకాశాలను అన్నింటినీ పరిశీలించాకే తగిన నిర్ణయం తీసుకోవాలి.
హెచ్చుతగ్గులు పట్టించుకోవద్దు
హిస్టారిక్ డేటా ప్రకారం, ఏ ఇతర పెట్టుబడి సాధనాలతో పోల్చి చూసినా, దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్ అధిక రాబడిని ఇస్తోంది. అందుకే మార్కెట్లో స్వల్పకాలిక హెచ్చుతగ్గులను చూసి భయపడిపోకూడదు. చాలా మంది మార్కెట్లు పతనం అవుతున్నప్పుడు షేర్లను నష్టాలకు అమ్మేస్తుంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. గత కొంతకాలంగా స్టాక్ మార్కెట్ చాలా హెచ్చుతగ్గులకు లోనయ్యింది. అక్టోబరు 3న మదుపరుల సంపద ఏకంగా రూ.11 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. కానీ మార్కెట్ విలువ పెరిగినప్పుడు మళ్లీ ఎంతకంటే ఎక్కువ సంపద సృష్టి జరుగుతుంది. కాబట్టి, స్వల్పకాలిక హెచ్చుతగ్గులను పట్టించుకోకూడదు. దీర్ఘకాలిక పెట్టుబడులపైనే ఫోకస్ పెట్టాలి. మంచి షేరు ఆకర్షణీయమైన ధరకు లభిస్తున్నప్పుడు దానిని వదులుకోకూడదు. మార్కెట్ సూచీల గమనాలను ఇలాంటప్పుడు పరిగణనలోకి తీసుకోకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్థిరంగా కదలాడుతూ ఉండే షేర్లు కొన్ని ఉంటాయి. వాటిని ఎంపిక చేసుకోవడం మంచిది.
అన్ని దశల్లోనూ
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. అవన్నీ స్టాక్ మార్కెట్లపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తుంటాయి. దేశాల మధ్య ఉద్రిక్తతలు, అమెరికాలో ఎన్నికలు, దేశంలోని ద్రవ్యోల్బణ పరిస్థితులు, అధిక వడ్డీ రేట్లు ఇలా ఎన్నో పరిణామాలు షేర్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంటాయి. వీటిని కచ్చితంగా గమనిస్తూ ముందుకెళ్లాలి. మార్కెట్ అన్ని దశల్లోనూ మన పెట్టుబడులను కొనసాగాలి. అప్పుడే భవిష్యత్తులో లాభాల సంపాదించడానికి అవకాశాలు పెరుగుతాయి. మార్కెట్లో ఒక కంపెనీ షేరును ఎంపిక చేసుకునేటప్పుడు దాని వాస్తవ విలువను తెలుసుకోవాలి. అలాగే సదరు షేరు ఎంత తక్కువకు దొరుకుతోంది? దానికున్న వృద్ధి అవకాశాలేమిటి? మొదలైన అంశాలను పరిశీలించాలి. తక్కువ ధరకు దొరుకుతున్నాయని ఏ షేరు బడితే ఆ షేరు కొనేయకూడదు. అలా చేస్తే నష్టపోవడం ఖాయం. అంతేకాదు మీ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో 12 షేర్లకు మించి ఉండకుండా చూసుకోవడం మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మీ మొత్తం పెట్టుబడిలో 50-60 శాతం వరకు మాత్రమే ఈక్విటీలకు కేటాయించాలి. మిగతాది స్థిరాదాయం ఇచ్చే పథకాల్లో పెట్టాలి" అని పట్టాభిరామన్ సూచిస్తున్నారు.