TCS Final Call For Staff To Work From Office :దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తమ ఉద్యోగులకు ఫైనల్ నోటీస్ ఇచ్చింది. మార్చి నెలాఖరులోగా కచ్చితంగా ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చి పనిచేయకపోతే, తరువాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది.
"టీసీఎస్ ఉద్యోగులు కచ్చితంగా ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలి. లేకుంటే తరువాతి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పనిచేయడం వల్ల పని సంస్కృతి (వర్క్ కల్చర్) దెబ్బతింటోంది. పైగా అనేక భద్రతాపరమైన సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి."
- ఎన్జీ సుబ్రమణియం, టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్
సహనం వహిస్తున్నాం - కానీ
'మేము ఉద్యోగుల పట్ల చాలా సహనం వహిస్తున్నాం. ఉద్యోగులు కచ్చితంగా ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలనే సూత్రప్రాయమైన నిర్ణయం తీసుకున్నాం. మేము ఇప్పటికే ఉద్యోగులకు ఈ విషయంపై ఫైనల్ నోటీస్ ఇచ్చాం. వారు కనుక మేము చెప్పినట్లు చేయకపోతే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది' అని టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబ్రమణియం స్పష్టం చేశారు.
సెక్యూరిటీ ఇష్యూస్
వర్క్ ఫ్రమ్ హోమ్ వలన ఉద్యోగులతోపాటు, యజమానులకు(ఐటీ సంస్థలకు) కూడా చాలా ఇబ్బందికరపరిస్థితి ఏర్పడుతోందని సుబ్రమణియం అభిప్రాయపడ్డారు. 'ముఖ్యంగా నేటి కాలంలో సైబర్ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంట్లో ఉండి పనిచేసేవారు ఈ భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కోలేరు. దీని వల్ల సంస్థకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయి' అని ఆయన అన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌కు చెందిన యూఎస్ యూనిట్ సైబర్ దాడికి గురైంది. ఫలితంగా అనేక అప్లికేషన్లు అందుబాటులో లేకుండా పోయాయి. మరో ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్ పైనా ర్యాన్సమ్వేర్ దాడి జరిగింది. అయితే దీని వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని హెచ్‌సీఎల్ టెక్ తెలిపింది. కానీ ఇది సెక్యూరిటీ లోపాలను స్పష్టంగా ఎత్తిచూపుతోంది.
హైబ్రిడ్ విధానానికి స్వస్తి
కొవిడ్-19 సంక్షోభం సమయంలో టీసీఎస్ 25బై25 హైబ్రిడ్ విధానాన్ని అమలు చేసింది. కానీ ఇప్పుడు దానికి పూర్తిగా స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీస్‌కు వచ్చి పని చేయాలని స్పష్టం చేస్తోంది.