తెలంగాణ

telangana

ETV Bharat / business

SIPలో ఇన్వెస్ట్​ చేస్తూ ఉంటే లాభాలే! హౌస్​ లోన్​కు కడుతున్న వడ్డీ కూడా సంపాదించుకోండిలా!! - SIP Tips And Tricks - SIP TIPS AND TRICKS

SIP Tips And Tricks : సిప్​ కోసం తెలుసు కదా! నిర్ణీత మొత్తాన్ని మదుపు చేస్తూ వెళ్లడం ద్వారా మార్కెట్‌ హెచ్చుతగ్గుల నుంచి ప్రయోజనాలు అందుకోవచ్చు. మరి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? హౌస్​ లోన్​కు కడుతున్న వడ్డీని సిప్​ ద్వారా ఎలా సంపాదించాలి?

SIP Tips And Tricks
SIP Tips And Tricks (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Aug 13, 2024, 1:41 PM IST

SIP Tips And Tricks :స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేం. ఒక్కోసారి భారీగా నష్టాల్లోకి వెళ్లిపోతాయి. ఆ తర్వాత మళ్లీ కోలుకుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీని వల్ల దీర్ఘకాలంగా పెట్టుబడులు పెట్టేవారికి ప్రయోజనాలు కలిగించినా, కొందరు మాత్రం నష్టపోతుంటారు. అయితే మ్యూచువల్ ఫండల్లో సిప్ ద్వారా మదుపు చేస్తున్న వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మార్కెట్ పరిస్థితి ఎలా ఉన్నా, మదుపు చేస్తూ వెళ్తుంటే లాభాలు వస్తుంటాయి. అయితే ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసా?

ముందుగా మన ఆర్థిక లక్ష్యాలేంటి? వాటిని సాధించేందుకు ఏం చేయాలి? అనే స్పష్టమైన ప్లానింగ్​తో సిప్​ను ప్రారంభించాలి. అయితే మీరు ఇప్పుడు పెట్టుబడి పెట్టే లక్ష్యాలు భవిష్యత్‌లో మారిపోవచ్చు. మీ అవసరాలను తీర్చేందుకు అధిక మొత్తంలో డబ్బు అవసరం కావచ్చు. చాలామంది అనేక పెట్టుబడి పథకాల్లో మదుపు చేస్తుంటారు. కానీ, లక్ష్య సాధనకు కావాల్సిన మొత్తం వారికి అందకపోవడం కనిపిస్తుంది.

దీనికి ప్రధాన కారణం భవిష్యత్‌ ఖర్చులపై అవగాహన లేకపోవడమే. లక్ష్యం చేరుకునేందుకు ఎంత వ్యవధి ఉంది, అప్పటికి కనీసం 6-7 శాతం ద్రవ్యోల్బణంతో కావాల్సిన మొత్తం ఎంత? ఎంత అధికంగా కావాల్సి వస్తుందన్న లెక్కలు వేసుకోవాలి. దానికి అనుగుణంగా సిప్‌ మొత్తాన్ని నిర్ణయించుకోవాలి. ఒక్కో లక్ష్యానికి ప్రత్యేక సిప్‌ ఉండేలా చూసుకోవాలి. అన్ని అంశాలను పరిశీలించాకే తగిన పథకాన్ని ఎంచుకోవాలి.

ఆందోళన అస్సలు అవసరం లేదు!
మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ చేస్తున్నవారు స్వల్పకాలిక హెచ్చుతగ్గుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మార్కెట్​లో ఏ సమయంలో మదుపు చేస్తున్నాం అనే దానికన్నా, ఎంత కాలం కొనసాగుతున్నాం అని చూసుకోవాలి. దీర్ఘకాలం కొనసాగినప్పుడే ఫలితాలు బాగుంటాయని చరిత్ర చెబుతోంది. సిప్​లో మదుపు చేస్తూ రూ.కోట్లలో సంపాదించడం కష్టమేమీ కాదు. కావాల్సిందల్లా దీర్ఘకాలం కొనసాగే ఓపిక, నెలనెలా పెట్టుబడి విషయంలో క్రమశిక్షణ.

వడ్డీ భారం లేకుండా!
మీరు గృహం కోసం రుణం తీసుకుని వడ్డీ కడుతున్నారా? ఆ వడ్డీని సిప్ ద్వారా సంపాదించుకోవాలనుకుంటున్నారా? అయితే రుణ వాయిదాలతోపాటు కొంత మొత్తం సిప్‌ చేస్తూ వెళ్తే రుణానికి చెల్లించిన వడ్డీని తిరిగి సంపాదించుకోవచ్చు. ఉదాహరణకు- 20 ఏళ్ల వ్యవధికి 9 శాతం వడ్డీ రేటుకు రూ.30 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం. రుణం తీరే నాటికి మొత్తం వడ్డీ రూ.34,78,027 అవుతుంది. దీన్ని తిరిగి పొందాలంటే రుణ మొత్తంలో 0.10 శాతం మేరకు అంటే రూ.3,000 నెలనెలా సిప్‌ చేయండి. రుణ వ్యవధి 20 ఏళ్లపాటు దీన్నీ కొనసాగించండి. అప్పుడు మొత్తం పెట్టుబడి రూ.7 లక్షల వరకు కూడా అవుతుంది. కనీసం 13 శాతం సగటు రాబడి అంచనాతో 20 ఏళ్లలో రూ.34,36,557 చేతిలో ఉంటుంది. అలా చేస్తే మీరు చెల్లించిన వడ్డీ దాదాపు తిరిగి వచ్చినట్లే!

ABOUT THE AUTHOR

...view details