Stock Market Today 31st January 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ప్రారంభంలో నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు తరువాత క్రమంగా పుంజుకుని భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. బ్యాంకింగ్, టెక్ స్టాక్స్ రాణించడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 612 పాయింట్లు లాభపడి 71,752 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 203 పాయింట్లు వృద్ధిచెంది 21,725 వద్ద ముగిసింది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : సన్‌ఫార్మా, టాటా మోటార్స్, ఎస్బీఐ, ఎం అండ్ ఎం, మారుతి సుజుకి, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఎల్ అండ్ టీ, టైటాన్
మార్కెట్స్ రీబౌండ్
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలైనప్పటికీ, తరువాత క్రమంగా పుంజుకున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ షేర్స్ భారీగా లాభపడ్డాయి. ఈ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ సూచీలపైనా పడింది. దీనితో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు మూటగట్టుకున్నాయి.
మదుపరులు గమనిస్తున్నారు
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. యూఎస్ ఫెడ్ కూడా త్వరలో కీలక వడ్డీ రేట్లు ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో మదుపరులు వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మంగళవారం రూ.1970.52 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు.