Silver Prices May Touch Rs1 Lakh : గత రెండేళ్లుగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. 2 ఏళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి, చాలా ఆకర్షణీయమైన లాభాలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితులు, ఉద్రిక్తతలు కొనసాగుతుండడం, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుండడం, వాణిజ్య అవరోధాల వల్ల బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. అయితే ఇప్పుడు వెండి ధరల వంతు వచ్చేసింది. రానున్న రోజుల్లో కిలో వెండి ధర రూ.1లక్ష దాటే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పెట్టుబడికి మంచి తరుణమిదే!
భారత్, చైనా సహా, కొన్ని దేశాల కేంద్ర బ్యాంకులు భారీ ఎత్తున బంగారం కొనుగోలు చేస్తున్నాయి. దీనితో పసిడికి భారీగా డిమాండ్ పెరుగుతోంది. గత ఏడాది కాలంలో గోల్డ్ రేటు (10 గ్రాముల 24 క్యారెట్ బంగారం) రూ.62,000 నుంచి రూ.75,000కు పెరిగింది. దీని ప్రకారం గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేసినవారికి సుమారుగా 20 శాతం వరకు లాభాలు వచ్చాయి. ప్రస్తుతానికి కేజీ వెండి ధర రూ.86,000 దాటేసింది. ఇక్కడి నుంచి కూడా వెండి ధరలు ఆకర్షణీయంగా పెరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 'త్వరలోనే కిలో వెండి ధర రూ.1,00,000 దాటే అవకాశం ఉంది' అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ తన తాజా నివేదికలో పేర్కొంది. మదుపరులు సిల్వర్‌పై ఇన్వెస్ట్ చేయడానికి ఇదే మంచి తరుణమని స్పష్టం చేసింది. ధరలు తగ్గిన ప్రతిసారీ వెండిని కొనుగోలు చేయవచ్చని సూచించింది.
కారణాలు ఇవే!
ఉత్పత్తి, పారిశ్రామిక డిమాండ్ అనేవి వెండి ధరలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మెక్సికో, దక్షిణ అమెరికా, పెరు, చిలీ, బొలీవియా, అర్జెంటీనా దేశాల్లో వెండి గనులు అధికంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే సిల్వర్‌లో ఈ దేశాల వాటానే 50 శాతానికి పైగా ఉంటుంది. అయితే ఈ దేశాల్లో రాజకీయ అస్థిర పరిస్థితులు ఉండడం సహా, ఇతర కారణాల వల్ల గత పదేళ్లుగా వెండి ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో వెండికి డిమాండ్ బాగా పెరుగుతోంది.