SBI Extends Deadline For Amrit Kalash FD scheme : మనదేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. 'అమృత్ కలశ్ పథకం' గడువును మరోసారి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ పథకం గడువును 2023 ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 31 వరకు పొడిగించింది. తరువాత దానిని 2024 మార్చి 31 వరకు పొడిగించింది. తాజాగా ఈ గడువును 2024 సెప్టెంబర్ 30 వరకు (సుమారు 6 నెలలు) పెంచుతూ సర్క్యులర్ జారీ చేసింది.
స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్
Amrith Kalash Scheme Interest Rates :ఎస్బీఐ 2023 ఫిబ్రవరి 15న అమృత్ కలశ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఒక ప్రత్యేకమైన ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. దీని కాలపరిమితి 400 రోజులు మాత్రమే. ఎస్బీఐ ఈ స్కీమ్ ద్వారా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. సాధారణ పౌరులకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు ఏకంగా 7.60 శాతం వరకు వడ్డీ అందిస్తుంది. అంటే సీనియర్ సిటిజన్లు ఈ అమృత్ కలశ్ పథకం ద్వారా అధిక లబ్ధి పొందుతారు.
2023 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకానికి వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తుండడం వల్ల, ఎస్బీఐ దీని గడువును మలుమార్లు పొడిగించింది. ఈ పథకంలో గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రవాస భారతీయులు కూడా ఈ స్కీమ్‌లో చేరడానికి అర్హులే.