SBI 40 LAKHS INSURANCE POLICY : భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరికీ ఎన్నో ప్రణాళికలు వేసుకొని ఉంటారు. కుటుంబం, పిల్లల బాగు కోసం పలు లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తుంటారు. వాటికోసం నిరంతరం కష్టపడుతుంటారు. అలాంటి వారు ప్రమాద వశాత్తూ ఈ లోకాన్ని వదిలిపెడితే! మొత్తం తల్లకిందులైపోతుంది. కుటుంబం పూడ్చలేని అగాథంలో కూరుకుపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం వారికి ఆర్థిక తోడ్పాటు ఉండడం అత్యవసరం. అందుకే, కుటుంబ పెద్దలు ముందు జాగ్రత్తగా బీమా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచనలు చేస్తుంటారు. అలాంటి ఒక ఇన్సూరెన్స్ పాలసీ గురించే ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. అదే, SBI వ్యక్తిగత ప్రమాద బీమా పథకం. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.
కుటుంబాన్ని తమ భుజాలపై మోస్తున్నవ ఇంటి పెద్దలు, తాము లేకపోయినా ఆర్థికంగా ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంతో పలు బీమా పాలసీలు తీసుకుంటూ ఉంటారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వీటిని అందిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పలు రకాల ఇన్సూరెన్స్ పాలసీలు అందిస్తోంది. అందులో ఒకటి PAI (Personal Accident Insurance). ఇందులో వంద రూపాయల నుంచి 2 వేల రూపాయల వరకు బీమా పాలసీలు ఉన్నాయి.
పలు రకాల స్లాబులు :
ఈ వ్యక్తిగత ప్రమాద బీమాలో పలు రకాల స్లాబులు ఉన్నాయి. ఏడాదికి 100 రూపాయలు చెల్లించే బీమా కొనుగోలు చేసిన వారు ప్రమాద వశాత్తూ మరణిస్తే, నామినీకి 2 లక్షల రూపాయలను బ్యాంక్ అందజేస్తుంది. 200 రూపాయలు ప్లాను తీసుకుంటే 4 లక్షల ప్రమాద బీమా అప్లై అవుతుంది. రూ.500 బీమా తీసుకున్నవారు 10 లక్షల ప్రమాద బీమాకు అర్హులవుతారు. ఇక, వెయ్యి రూపాయల ఇన్సూరెన్స్ తీసుకుంటే 20 లక్షలు క్లైమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వెయ్యి రూపాయల స్లాబునే, SBI తాజాగా విస్తరించి, 2 వేలకు పెంచింది. ఇది కొనుగోలు చేసిన వారు ప్రమాద వశాత్తూ మరణిస్తే, నామినీకి 40 లక్షల రూపాయలు చెల్లిస్తారు.
ఈ మరణాలు మాత్రమే లెక్కలోకి :
ప్రమాదాల్లో సంభవించిన మరణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. సహజ మరణాలను, అనారోగ్య మరణాలను లెక్కలోకి తీసుకోరు. రోడ్డు ప్రమాదాలు, కరెంట్ షాక్, వరదలు, భూకంపాలు, పాము, తేలు కాటు ద్వారా సంభవించే ప్రమాద మరణాలకు మాత్రమే బీమా వర్తిస్తుంది. ఈ బీమాలో చేరడానికి 18 నుంచి 70 ఏళ్ల వయసున్న వారు అర్హులు.