RBI Guidelines On Credit Card Selection :ఎవరైనా క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసినప్పుడు, అది మన చేతికి అందేదాకా ఏ కార్డు వస్తుందో చెప్పలేం. రూపే కార్డు ఇవ్వాలా? వీసా, మాస్టర్ కార్డా? అన్నది బ్యాంకులే నిర్ణయిస్తాయి. అయితే క్రెడిట్ కార్డు నెట్‌వర్క్‌లను ఎంపిక చేసుకునే అవకాశం వినియోగదారులకు ఉండేది కాదు. అయితే దీనికి చెక్ పెడుతూ ఆర్బీఐ కొన్నాళ్ల క్రితం ఆదేశాలు జారీ చేసింది. నచ్చిన నెట్‌వర్క్ నుంచి కార్డును ఎంపిక చేసుకునే ఆప్షన్‌ను వినియోగదారులకు ఇవ్వాలని పేర్కొంది. ఈ ప్రక్రియ సెప్టెంబరు 6వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీని వల్ల యూజర్లకు ఉపయోగాలేంటి? అమలు సాధ్యాసాధ్యాలపై ఓ లుక్కేద్దాం.
ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో కస్టమర్ల తమకు నచ్చిన క్రెడిట్ కార్డు నెట్‌వర్క్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే వారికి అధిక ప్రయోజనాలు, తక్కువ కార్డు ఫీజు, రివార్డులు ఇచ్చే నెట్‌వర్క్‌ను ఎంచుకోవచ్చు. కస్టమర్ల అవసరాలు, ఖర్చులను బట్టి వారికి సరిపోయే క్రెడిట్ కార్డును తీసుకోవచ్చు. సెప్టెంబరు 6 నుంచి మీరు కొత్త క్రెడిట్ కార్డ్, రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసినప్పుడు మీకు నచ్చిన నెట్‌వర్క్ నుంచి కార్డును ఎంపిక చేసుకునే ఆప్షన్ అందుబాటులోకి రానుంది. రూపే, వీసాలో ఏదైనా ఎంచుకునే వెసులుబాటు వినియోగదారులకు ఉంటుంది. అంతకుముందు క్రెడిట్ కార్డు జారీ సంస్థలే యూజర్ల కార్డు నెట్‌వర్క్‌ను నిర్ణయించేవి. ఆర్బీఐ నిర్ణయంతో కస్టమర్లే వారికి నచ్చిన క్రెడిట్ కార్డు నెట్‌వర్క్‌ను ఎంపిక చేసుకోవచ్చు. కాగా, ఈ నిర్ణయాన్ని వీసా ప్రతినిధి ఒకరు సమర్థించారు.
క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్‌పై ఆర్బీఐ నిర్ణయం ఎందుకు?
క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్‌లో వీసా, మాస్టర్ కార్డు అగ్రగామిగా ఉన్నాయి. ఇప్పుడు రూపే నెట్‌వర్క్ కూడా బాగా పెరిగింది. దీంతో మార్కెట్లో పోటీ ఏర్పడింది. అయితే ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది ఆర్థిక నిపుణులు, క్రెడిట్ కార్డు జారీ సంస్థలు సమర్థిస్తున్నాయి. నచ్చిన నెట్‌వర్క్ నుంచి కార్డును ఎంపిక చేసుకునే ఆప్షన్‌ను ఆర్బీఐ తీసుకురావడం వల్ల దేశంలో డిజిటల్ చెల్లింపుల విభాగంలో కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరిచే వ్యూహమేనని యస్ బ్యాంక్, క్రెడిట్ కార్డ్స్ అండ్ మర్చంట్ అక్వైరింగ్ కంట్రీ హెడ్ అనిల్ సింగ్ తెలిపారు.
నచ్చిన క్రెడిట్ కార్డు నెట్‌వర్క్‌ను ఎంచుకోవడం ఎలా?
బ్యాంక్ ఆఫ్ బరోడా, యస్ బ్యాంక్ వంటి కొన్ని బ్యాంకులు ఇప్పటికే కస్టమర్లకు వారికి నచ్చిన క్రెడిట్ కార్డు నెట్‌వర్క్‌ను ఆప్షన్‌ను అందిస్తున్నాయి. ఆర్బీఐ ఆదేశాలనుసారం కొత్త క్రెడిట్ కార్డ్ కోసం జారీ చేసేటప్పుడు తమ ప్రాధాన్య నెట్‌వర్క్‌ను ఎంచుకోవాలని కస్టమర్లను కోరుతున్నాయి. ఈ బ్యాంకులు ఇప్పటికే ఉన్న కస్టమర్లను క్రెడిట్ కార్డు రెన్యూవల్ సమయంలో నచ్చిన నెట్‌వర్క్‌ను ఎంచుకోవడానికి ఈ-మెయిల్, కస్టమర్ కేర్ లైన్‌కు కాల్ చేయమని కోరుతున్నాయి.
ఆర్బీఐ నిర్ణయం వల్ల ప్రయోజనాలేంటి?
నచ్చిన నెట్‌వర్క్ నుంచి కార్డును ఎంపిక చేసుకునే ఆప్షన్‌ను జారీ సంస్థలు వినియోగదారులకు ఇవ్వడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. నిర్దిష్ట నెట్‌వర్క్‌లు పలు ప్రాంతాల్లో విస్తృత ఆమోదాన్ని పొందొచ్చు. కస్టమర్లు తమకు నచ్చిన నెట్‌వర్క్‌ను ఎంచుకోవచ్చు. అయితే క్రెడిట్ కార్డు ప్రయోజనాలు ప్రధానంగా దాన్ని జారీ చేసే బ్యాంకుపై ఆధారపడి ఉంటాయి.