Risks Of Loan Guarantor :గృహ, వాహన రుణాలు, వ్యాపారానికి పెద్ద మొత్తంలో అప్పు తీసుకునే వారి విషయంలో బ్యాంకులు, రుణ సంస్థలు ఎవరినైనా హామీగా చూపించాలని కోరుతుంటాయి. దీంతో కాస్త హామీ సంతకం చేస్తారా? అంటూ మీ స్నేహితుడో, బంధువో అడిగితే మీరు కాదనలేకపోవచ్చు. మీ మధ్య ఉన్న స్నేహమో, బంధుత్వమో లేదా మొహమాటం కొద్దో అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. దాని వెనకున్న రిస్క్ గురించి ఏమాత్రం ఆలోచించరు. నిజంగా మీరు గ్యారంటీ సంతకం పెడుతున్న వ్యక్తి నమ్మకస్థుడైతే ఫరవాలేదు. కానీ, ఏవైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి హామీ కోసం మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. లేదంటే ఆ భారం మొత్తం మీరే మోయాల్సి రావొచ్చు.
రిస్క్ ఎంతో తెలుసుకోవాలి!
ఇతరులు తీసుకున్న లోన్‌కు హామీ ఇస్తున్నామంటే మనకూ కొన్ని బాధ్యతలు ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలి. అందుకే, ఓకే అనే ముందు మీపై దాని ప్రభావం ఎంత వరకు ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఈ విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి
ఎవరికైనా రుణ హామీదారుడిగా ఉండే ముందు లోన్ తీసుకునే వ్యక్తి గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి. రుణగ్రహీత లోన్ తిరిగి చెల్లించగలరా? క్రెడిట్ యోగ్యత, రుణ ప్రయోజనం, ఆర్థిక స్థిరత్వం వంటి విషయాలను పరిశీలించాలి. ఎందుకంటే రుణం తీసుకున్న వ్యక్తి దానిని చెల్లించడంలో విఫలమైతే, దాన్ని మీరే చెల్లించాల్సి రావొచ్చు. ఎందుకంటే రుణదాత తన డబ్బును పొందడానికి మీ వద్దకే వస్తారనే విషయం మర్చిపోవద్దు.
హామీదారుడికే నోటీసులు
రుణగ్రహీత కొన్నిసార్లు ఉద్యోగం కొల్పోవడం, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సంక్షోభం వంటి కారణాల వల్ల బకాయిలను తిరిగి చెల్లించడంలో విఫలమవ్వొచ్చు. ఆ సమయంలో రుణగ్రహీత హామీదారుడితో కమ్యూనికేషన్ తగ్గిస్తారు. ఆ తర్వాత పూర్తిగా కాంటాక్ట్‌లో ఉండరు. రుణగ్రహీత ఆర్థికంగా ఎలా ఉన్నాడో మీకు తెలియదు. ఏదో ఒకరోజు అతడు గత కొన్ని నెలలుగా లోన్ ఈఎమ్ఐలు చెల్లించట్లేదని మీకు తెలుస్తుంది. అప్పుడు బ్యాంకు మీకు నోటీసులు ఇస్తుంది. ఆ సమయంలో మీరు రుణగ్రహీతను సంప్రదించడానికి ప్రయత్నించినా మీకు వాళ్లు స్పందించకపోవచ్చు.