Risks In Fixed Deposits :భారతదేశంలో చాలా మంది ఎంచుకునే పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఒకటి. అందులో పెట్టుబడి పెడితే, గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయని నమ్మకం. అందులో నిజం లేకపోలేదు. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లు సురక్షితమైనప్పటికీ, అందులోనూ కొన్ని రిస్క్‌లు ఉన్నాయి. అవేెంటో ఇప్పుడు చూద్దాం.
ఇటీవల మన దేశంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లు పెరిగాయి. కొన్ని బ్యాంకులు ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు 8.25 శాతం, సాధారణ డిపాజిటర్లకు 7.75 శాతం చొప్పున వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. చాలా ఎఫ్డీలు సమయాన్ని బట్టి స్థిరమైన వడ్డీ రేటును అందిస్తాయి. దీని వల్ల కొన్ని లాభాలున్నాయి. అయితే బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టినప్పుడు ఎలాంటి రిస్క్ ఉండదని చాలా మంది అనుకుంటారు. కానీ పూర్తిగా రిస్క్ లేని పెట్టుబడి అంటూ ఏం ఉండదు. మిగతా వాటితో పోలిస్తే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో రిస్క్ కాస్త తక్కువ మాత్రమే. మీరు ఏవైనా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ కింది 4 రిస్కుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
1. డిఫాల్ట్ :మన దేశంలో చాలా బ్యాంకులు దివాలా తీస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మదుపరులు, ఖాతాదారులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. అయితే మన దేశంలో డిపాజిట్ల మీద 'డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC)' అనేది ఒక్కో బ్యాంక్ ఖాతాదారునికి రూ.5 లక్షల వరకు బీమా కల్పిస్తుంది. ఒకవేళ మీ బ్యాంకు బోర్డు తిప్పేస్తే, మీరు పొదుపు చేసిన మొత్తం అమౌంట్ మీకు రాదు. కేవలం నిర్దేశిత బీమా అమౌంట్ మాత్రమే మీకు లభిస్తుంది.
2. వడ్డీ రేటు :ఫిక్స్‌డ్ డిపాజిట్లు నిర్దష్ట కాలపరిమితికి, స్థిరమైన వడ్డీ రేటును అందిస్తాయి. ఇది కొంత వరకు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, నష్టం కూడా ఉంది. ఒకవేళ మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన తర్వాత కొన్ని రోజులకు మార్కెట్లో వడ్డీ రేటు పెరిగితే, అది మీ పెట్టుబడికి వర్తించదు. మీరు ముందుగా ఒప్పందం చేసుకున్న వడ్డీ రేటుకే కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఒక రకంగా ఇది మిమ్మల్ని నిరుత్సాహానికి గురి చేసే ఛాన్స్ ఉంది.