Right Time To Switch Funds In ULIP :భవిష్యత్ భద్రంగా ఉండాలంటే, వీలైనంత త్వరగా సురక్షితమైన పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందవచ్చు. మరి మీరు కూడా ఇలాంటి పెట్టుబడి మార్గం గురించి ఆలోచిస్తున్నారా? అయితే 'యులిప్' పథకాలు మంచి ఎంపిక అవుతాయి. యులిప్ పథకాలతో మంచి రాబడితోపాటు, బీమా రక్షణ లభిస్తుంది. అదనంగా పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. కనుక ఈ మూడు లాభాలు కావాలనుకునేవారు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యులిప్)లను ఎంచుకోవడం మంచిది. ఒక వేళ మీరు ఇప్పటికే యులిప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటే, కచ్చితంగా ఫండ్ స్విచ్ఛింగ్ ఆప్షన్ గురించి తెలుసుకోవాలి. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫండ్ స్విచ్ఛింగ్
మీ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వివిధ పెట్టుబడి పథకాలకు నిధులు కేటాయించడం, అవసరాన్ని బట్టి మార్చుకోవడం లాంటి ఎన్నో సౌలభ్యాలు ఈ యులిప్ పాలసీలో ఉంటాయి. దీనినే ఫండ్ స్విచ్ఛింగ్ అని అంటారు. ఒక సంవత్సరంలో నిర్ణీత సంఖ్యలో ఎలాంటి ఖర్చూ లేకుండా ఈ ఫండ్ స్విచ్ఛింగ్ చేసుకోవచ్చు.
బహుళ ప్రయోజనాలు
దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించడం సహా పన్ను ప్రయోజనాలు, బీమా రక్షణ పొందడం మొదలైన బహుళ ప్రయోజనాలు ఈ యులిప్ పథకాల ద్వారా పొందవచ్చు.
పెట్టుబడిదారులు ఈ యులిప్ పథకాల ద్వారా ఈక్విటీ, డెట్, బ్యాలెన్స్డ్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ విధంగా తమ ఆర్థిక లక్ష్యాల సాధనకు తగిన విధంగా ప్రీమియం డబ్బులను వివిధ పెట్టుబడి మార్గాలకు కేటాయించవచ్చు.
ఈక్విటీ ఫండ్స్
ఈక్విటీ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తే, దీర్ఘకాలంలో మంచి వృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. ఈ ఈక్విటీ ఫండ్లు ప్రాథమికంగా స్టాక్స్‌లో మదుపు చేస్తాయి. అయితే వీటిలో కాస్త రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీ పెట్టుబడులు మార్కెట్ ఒడుదొడుకులకు లోనవుతాయి. కానీ దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇచ్చే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు ఒక 30 ఏళ్ల వ్యక్తి దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి పెట్టాలని అనుకున్నాడు. అప్పుడు అతను ఈక్విటీలకు ఎక్కువ భాగం కేటాయించవచ్చు. దీని వల్ల రిటైర్ అయ్యేనాటికి భారీగా రాబడి సంపాదించేందుకు వీలవుతుంది.
డెట్ ఫండ్స్
నష్ట భయం లేకుండా మంచి రాబడి రావాలని ఆశించేవారు యులిప్ డెట్ ఫండ్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. యులిప్ డెట్ ఫండ్లు ప్రధానంగా ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ బాండ్లు, మనీ మార్కెట్ లాంటి స్థిరాదాయ సాధనాల్లో మదుపు చేస్తుంటాయి. కనుక రిటైర్మెంట్కు చేరువలో ఉన్నవారు యులిప్ డెట్ ఫండ్స్ ఎంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం పొందేందుకు ఇవి బాగా ఉపకరిస్తాయి.
బ్యాలెన్స్డ్ ఫండ్స్
కొంతమంది రిస్క్, రివార్డ్ రెండూ కావాలని అనుకుంటారు. ఇలాంటి వారికి బ్యాలెన్స్డ్ ఫండ్స్ చాలా బాగుంటాయి. ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ప్రధానంగా ఈక్విటీ, డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. దీని వల్ల రాబడితోపాటు, ప్రతికూల పరిస్థితుల్లో మీ పెట్టుబడికి రక్షణ కూడా లభిస్తుంది. పిల్లల ఉన్నత చదువుల కోసం పెట్టుబడులు పెట్టాలని అనుకునే తల్లిదండ్రులు, కాస్త నష్టభయం తక్కువగా ఉండే ఈ బ్యాలెన్స్డ్ పథకాలను ఎంచుకోవచ్చు.
మార్పులు, చేర్పులు
యులిప్ పథకాల్లో స్విచ్ఛింగ్ ఆప్షన్ ఉంటుంది. కనుక దీనిని ఉపయోగించి ఇన్వెస్టర్లు కాలానుగుణంగా, తమ పెట్టుబడి వ్యూహాలను మార్చుకోవచ్చు. అలాగే మార్కెట్లు పతనం అవుతున్నప్పుడు, తమ నష్టాలను తగ్గించుకోవచ్చు. అన్నీ సానుకూలంగా ఉన్నప్పుడు భారీగా లబ్ధి పొందవచ్చు. అయితే యులిప్‌లో పెట్టుబడులను మార్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సమయ పాలన, వ్యూహాత్మక విధానాలను అనుసరించాలి. మీకు సరైన అవగాహన లేకపోతే, నిపుణుల సలహాలు తీసుకోవాలి.
కొత్త పథకాలు
బీమా సంస్థలు యులిప్ పాలసీదారుల కోసం ఇటీవలి కాలంలో అనేక కొత్త పథకాలను తీసుకువచ్చాయి. భిన్నమైన పెట్టుబడి వ్యూహాలతో వచ్చిన ఈ ఫండ్లను కూడా మీరు పరిశీలించవచ్చు. అయితే మీరు ఎంచుకున్న పాలసీ ఈ సరికొత్త ఫండ్లలోకి మారేందుకు అవకాశం కల్పిస్తోందా? లేదా? అనేది ముందుగానే మీ బీమా సంస్థను సంప్రదించి తెలుసుకోవాల్సి ఉంటుంది.
కాలానికి అనుగుణంగా మార్పు!
మారుతున్న అవసరాలకు అనుగుణంగా పెట్టుబడుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాలి. రిస్క్‌లను తట్టుకోగలిగేవారు ప్రారంభంలో ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. కానీ రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నవారు సంప్రదాయక విధానాన్నే పాటించడం మంచిది. ముఖ్యంగా 10-15 ఏళ్ల కంటే ఎక్కువ సమయం పెట్టుబడులు కొనసాగించగలిగే వారికి యులిప్ పథకాలు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే సంపద సృష్టికి ఓర్పు, సహనం, క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని మర్చిపోకూడదు.
మీకు సేవింగ్స్ అకౌంట్ ఉందా? అయితే ఈ 8 లాభాలు గురించి తెలుసుకోండి!
మీ NPS అకౌంట్ డీయాక్టివేట్ అయ్యిందా? - ఇలా రియాక్టివేట్ చేసుకోవచ్చు!