Retirement Planning In Telugu : ఎవరికైనా వారి పదవీ విరమణ అనంతర జీవితం చాలా ముఖ్యం. అయితే పదవీ విరమణ తర్వాత మిగతా జీవిత కాలానికి రూ.1 కోటి సరిపోతుందా? లేదా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. వ్యక్తుల లైఫ్ స్టైల్, ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ ఖర్చులను బట్టి ఎంత పదవీ విరమణ నిధి ఉండాలనేది మారుతూ ఉంటుంది.
జీవనశైలి, ఖర్చులు ఆధారంగా
హాయిగా రిటైర్ కావడానికి ఎంత సొమ్ము సరిపోతుందని అడిగితే, సరిపోయే సమాధానం అందరి దగ్గర ఉండకపోవచ్చు. దీనిని ప్రతి వ్యక్తికి వారి లైఫ్ స్టైల్ ప్రకారం లెక్కించాలి. ప్రస్తుతం ఉన్న జీవనశైలి 60 ఏళ్ల వయసులో భిన్నంగా ఉండొచ్చు. ప్రస్తుతానికి రూ.1 కోటి అంటే గొప్పగా అనిపించినప్పటికీ, పదవీ విరమణ తర్వాత మీ అవసరాలు భిన్నంగా ఉండవచ్చు. కొందరు పొదుపుగా ఉండొచ్చు. మరి కొందరు అతిగా ఖర్చులు పెట్టవచ్చు. అందువల్ల మీ పదవీ విరమణ నిధిని ప్లాన్ చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ జీవనశైలిలో మార్పులను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.
ద్రవ్యోల్బణం పెరిగితే
ద్రవ్యోల్బణం కాలక్రమేణా డబ్బు విలువను తగ్గిస్తుంది. కనుకన మీ కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఈ రోజు రూ.1 కోటి విలువైనదిగా అనిపించొచ్చు కానీ అధిక ద్రవ్యోల్బణం, సామాజిక భద్రత లేకపోవడం వల్ల భారత్‌లో మనుగడ సాగించడానికి ఇంకా పెద్ద మొత్తమే అవసరం అవ్వవచ్చు. వస్తు, సేవల ధరలు పెరిగే కొద్దీ, పదవీ విరమణ ప్రణాళికలో మీ పొదుపు విలువ తగ్గుతుంది. పదవీ విరమణ ప్రణాళికను ఎంపిక చేసుకునేటప్పుడు ద్రవ్యోల్బణం రేటును పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం.
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుదల
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు కాలక్రమేణా పెరుగుతున్నాయి. ప్రస్తుత కాలంలో ఆరోగ్యం కోసం బాగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. వైద్యం, బీమాతో పాటు వీటికి సంబంధించిన ఇతర ఖర్చులు పదవీ విరమణ ప్రణాళికలో కీలక భాగంగా ఉండాలి. పదవీ విరమణ వయసులో ఎటువంటి హెచ్చరిక లేకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ బీమా రేటూ పెరుగుతుంది. కాబట్టి వైద్య ఖర్చులు, ఆరోగ్య బీమా కోసం ముందుగానే ప్లాన్ చేసుకోండి. మీకు వైద్య బీమా లేకుంటే, పదవీ విరమణ నిధిలో ఊహించని తరుగుదలను ఎదుర్కోవలసి రావచ్చు.