Reliance Industries Q4 Results 2024 :రిలయన్స్ ఇండస్ట్రీస్ జనవరి- మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో నికర లాభం స్వల్పంగా క్షీణించి రూ.18,951 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.19,299 కోట్లతో పోలిస్తే ఇది రెండు శాతం తక్కువ. కంపెనీలో ప్రధాన వ్యాపార విభాగమైన ఆయిల్, పెట్రో కెమికల్ వ్యాపారం కోలుకోవడం, టెలికాం, బిజినెస్ వ్యాపార విభాగాలు రాణించడం వల్ల లాభం దాదాపు ఫ్లాట్‌గా నమోదైంది.
ప్రధానంగా చమురు ధరలు పెరగడం వల్ల సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 11 శాతం మేర పెరిగింది. మొత్తం రూ.2.64 లక్షల కోట్లు ఆదాయంగా వచ్చినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రిలయన్స్ రికార్డు స్థాయిలో రూ.69,621 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు సంవత్సరం సాధించిన రూ.66,702 కోట్లను అధిగమించింది. అదనంగా, రిలయన్స్ FY24లో రూ.10 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిన మొదటి భారతీయ కంపెనీగా రికార్డు క్రియేట్ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ.9.74 లక్షల కోట్ల ఉండగా 2.6% పెరిగి రూ.10 లక్షల కోట్లకు చేరుకుంది.
జియో అదుర్స్
భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో కూడా త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. క్యూ4లో రూ.5,337 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,716 కోట్లతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రూ.25,959 కోట్లు ఆదాయం వచ్చినట్లు జియో తెలిపింది.