PMAY-Urban 2.0 Scheme : దేశంలోని పేదలకు పక్కా ఇళ్లు కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన- అర్బన్ (పీఎంఏవై-యూ) 2.0. ఈ పథకం కింద కోటి ఇళ్లను మంజూరు చేసేందుకు ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ పథకానికి ఎవరు అర్హులు? ప్రభుత్వం నుంచి లభించే రాయితీలు ఏంటి? తదితర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
పీఎంఏవై-యూ 2.0 అంటే ఏమిటి?
పట్టణాల్లో నివసించే పేద, మధ్యతరగతి ప్రజలు సహేతుకమైన ధరలో ఇల్లు నిర్మించుకోవడానికి, కొనుగోలు చేయడానికి లేదా సరైన ఇంటిని అద్దెకు తీసుకోవడానికి ఆర్థిక సాయం అందించడమే పీఎంఏవై-యూ 2.0 పథకం ప్రధాన లక్ష్యం. దేశంలో పట్టణాల్లో నివసించే, సొంతిల్లు లేని ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద ఇల్లు కట్టుకోవడం/కొనుగోలు చేయవచ్చు. దీని కోసం సబ్సిడీపై గృహ రుణాన్ని పొందవచ్చు.
పీఎంఏవై-యూ పథకం వల్ల ప్రయోజనం ఎవరికి?
మురికివాడల్లో నివసించేవారికి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, వితంతువులు, దివ్యాంగులు, సమాజంలో వెనుకబడిన, అట్టడుగు వర్గాలకు ఈ స్కీమ్ మేలు చేకూరుస్తుంది. అలాగే సఫాయి కార్మికులు, వీధి వ్యాపారులు, చేతివృత్తులవారు, అంగన్ వాడీ వర్కర్స్ వంటివారు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు.
పీఎంఏవై-యూ పథకానికి అర్హతలేంటి?
ఆర్థిక బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్), అల్పాదాయ వర్గాలు (ఎల్ఐజీ), మధ్యస్థాయి ఆదాయ వర్గం(ఎంఐజీ) వారు ఈ పథకానికి అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం సున్నా నుంచి రూ.3 లక్షల మధ్య ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ (ఆర్థిక బలహీన వర్గాలు) కేటగిరీ కిందకు వస్తారు. అలాగే రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు ఎల్ఐజీ కేటగిరీ కిందకు వస్తారు. వార్షిక ఆదాయం రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఉంటే వారిని ఎంఐజీ కేటగిరీ వారిగా పరిగణిస్తారు.
బెనిఫిషియరీ లెడ్ కన్‌స్ట్రక్షన్ (BLC) : ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వారికి సొంత స్థలం ఉంటే, వారు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. భూమి లేని లబ్ధిదారులకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట పట్టా భూమి ఇస్తుంది.