How To Apply For PMAY 2.0 : మీరు కొత్త ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 (PMAY 2.0) ప్రారంభమైంది. దీనికి అప్లై చేసుకుంటే చాలు మీ కలల ఇంటిని సొంతం చేసుకోవచ్చు. ఎలా అంటే?
కోటి ఇళ్లు
పట్టణ ప్రాంతాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్), మధ్యతరగతి కుటుంబాలకు సరసమైన ధరల్లో గృహ నిర్మాణం/ కొనుగోలు/ అద్దెకు ఇల్లు తీసుకోవడం లాంటి వాటికి - ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చింది. 2024 ఆగస్టు 9న కేంద్ర కేబినెట్ ఈ పథకాన్ని ఆమోదించింది. దీని ద్వారా ఒక కోటి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది.
గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, పీఎంఏవై మొదటి దశలో 1.18 కోట్ల గృహాలు మంజూరు చేశారు. వాటిలో ఇప్పటికే 85.5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చారు. ఇప్పుడు PMAY-U 2.0కు శ్రీకారం చుట్టారు. దీని ద్వారా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడితో, ఒక కోటి ఇళ్లను పేద, మధ్యతరగతి వాళ్లకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. కనుక అర్హులైన వాళ్లు ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు.
వడ్డీ రాయితీ : పీఎంఏవఐ-యూ 2.0 స్కీమ్‌లో భాగంగా, గృహ రుణాలపై వడ్డీ రాయితీ అందిస్తారు. ఉదాహరణకు రూ.35 లక్షల విలువైన ఇంటి కోసం రూ.25 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. ఈ రుణాన్ని తీసుకునే లబ్ధిదారులు 12 సంవత్సరాల కాలవ్యవధి వరకు, మొదటి రూ.8 లక్షల రుణంపై 4 శాతం వరకు వడ్డీ రాయితీ పొందవచ్చు. అర్హత కలిగిన లబ్ధిదారులు 5 సంవత్సరాల్లో రుణం తీర్చాలని అనుకుంటే, గరిష్ఠంగా రూ.1.80 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది.