Personal Financial Planning :ప్రతి ఒక్కరికీ ఆర్థిక ప్రణాళిక ఉండాలి. అప్పుడే జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతాం. ఆర్థిక వనరులను సాధ్యమైనంత ఉత్తమంగా ఉపయోగించుకోవాలి. ఇందుకోసం ప్రతి ఒక్కరూ మంచి ఆర్థిక ప్రణాళికను వేసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడే భవిష్యత్ ఆర్థికంగా బాగుంటుంది. మరెందుకు ఆలస్యం, సరైన ఆర్థిక ప్రణాళిక ఎలా వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బడ్జెట్ :కేవలం జీతంతో మాత్రమే జీవించేవారు అనుకోని ఖర్చులు ఎదురైనప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతారు. అందువల్ల ప్రతి ఒక్కరూ బడ్జెట్ రెడీ చేసుకోవాలి. సరైన బడ్జెట్‌ను మీరు తయారుచేసుకోకపోతే, ఖర్చులను నియంత్రించలేరు. మీకు ఎంత డబ్బు వస్తుందో చూసుకోవాలి. మీ ఖర్చులను వర్గీకరించుకోవాలి. అత్యవసరాలు ఏమిటి? లగ్జరీ వస్తువులు, నివారించదగిన ఖర్చులు గురించి పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలి. ఈ విధంగా ఖర్చుల పూర్తి జాబితాను తయారు చేయాలి. దీని వల్ల దేనికి ముందుగా ఖర్చు చేయాలో తెలుస్తుంది. పరిమిత వనరులు, అపరిమిత కోరికలు చాలా మందికి ఉంటాయి. అందువల్ల మీరు మీ వనరులను సరిగ్గా నిర్వహించాలి. అనవసర ఖర్చులను పూర్తిగా మానుకోవాలి. సరిగ్గా ప్లాన్ చేస్తే కొంత డబ్బును వినోదం కోసం, మీ చిన్నిచిన్ని కోరికలు తీర్చుకోవడం కోసం కేటాయించుకోవచ్చు.
బ్యాలెన్స్ షీట్ :ప్రతి ఏడాది మీ ఆస్తుల, రుణాల జాబితాను తయారు చేసుకోవాలి. బ్యాంక్ బ్యాలెన్స్, పెట్టుబడులు, ఇంటి విలువ, ఇతర ఆస్తుల విలువను లెక్కించాలి. కారు లోన్, ఇంటి లోన్, క్రెడిట్ కార్డు బ్యాలెన్సులతోపాటు ఇతర లోన్స్ జాబితాను తయారు చేసుకోవాలి. ఈ వ్యక్తిగత బ్యాలెన్స్ షీట్ ఆర్థికపరంగా మీ నికర విలువను చూపిస్తుంది. మీ ఆర్థిక స్థితిని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు చాలా ఉపయోగపడుతుంది.
మిగులు నగదు :మీ దగ్గర ఉన్న మిగులు నగదుతో ఎలా వ్యవహారిస్తారనేది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ దగ్గర ఉన్న నగదును సరైన చోట పెట్టుబడి పెట్టనట్లయితే, ద్రవ్యోల్బణం కారణంగా దాని విలువ తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు అనుకున్న విధంగా పదవీ విరమణ చేయలేరు. కాబట్టి పెట్టుబడిని ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది. మీ మిగులు మొత్తాన్ని రుణాలను తీర్చేందుకు వాడుకోవచ్చు.
పదవీ విరమణ నిధి :పదవీ విరమణ ప్రణాళిక ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైంది. అంతేకాదు ప్రతి ఏడాది ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతాయి. ఈ ఖర్చులన్నింటికీ నిధులు సమకూర్చేందుకు మీరు సొంతంగా కొంత డబ్బులు కలిగి ఉండాలి. రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నప్పుడు, మీకు ప్రతి నెలా ఎంత డబ్బు అవసరం ఉంటుందో అంచనా వేసుకోవాలి. ఆర్థిక భద్రత కోసం నష్టభయంలేని ప్రభుత్వ పథకాల్లో మదుపు చేసుకోవాలి.
రుణాలు :ఆర్థిక ప్రణాళికలో లోన్ నిర్వహణ కూడా కీలకమైంది. మీకు ఎక్కువ అప్పులు ఉంటే ముందుగా ఎక్కువ వడ్డీ ఉన్న రుణాన్ని తీర్చండి. ముఖ్యంగా క్రెడిట్ కార్డు లోన్స్ అత్యంత ఖరీదైనవి. ప్రతినెలా మీ జీతం క్రెడిట్ అయిన వెంటనే క్రెడిట్ కార్డు బ్యాలెన్స్‌ను పూర్తిగా చెల్లించండి. మినిమం బ్యాలెన్స్ చెల్లించేందుకు అవకాశమున్నా సరే దాన్ని వినియోగించుకోకూడదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే క్రెడిట్ కార్డును ఉపయోగించడం అలవాటు చేసుకోండి. ఎప్పుడూ రుణం తీసుకోవడాన్ని చివరి ప్రయత్నంగానే ఉంచండి. వీలైనంత వరకు మీ కొనుగోళ్లకు నగదు రూపంలోనే బిల్లు చెల్లించండి. దీని వల్ల దుబారా ఖర్చు బాగా తగ్గుతంది. ఇంటిలోన్ వంటి పెద్ద రుణాన్ని తీసుకున్నప్పుడు బ్యాలెన్స్ బదిలీ ఆప్షన్ ఉందో, లేదో చూసుకోండి. దీని వల్ల తక్కువ వడ్డీరేటు ఉన్న మరో బ్యాంకుకు రుణాన్ని బదిలీ చేయవచ్చు. దీని వల్ల వడ్డీ రూపంలో మీకు డబ్బు ఆదా అవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు విలువ తగ్గే మోటారు వాహన రుణాల కోసం ప్రయత్నించకపోవడమే మంచిది.
ఎస్టేట్ ప్లాన్ :చాలా మందికి ప్రాపర్టీస్ ఉంటాయి. అవి వాహనం, ఇల్లు, సేవింగ్స్ ఖాతాలో నగదు ఇలా ఏవైనా కావచ్చు. సమయం వచ్చినప్పుడు మీ అనంతరం వీటిని ఏం చేయాలో నిర్ణయించడం మీ బాధ్యత. సరైన పద్ధతిలో ఆస్తుల కేటాయింపులు జరిగేలా, మీరు మంచిగా ఉన్నప్పుడే తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ఎస్టేట్ ప్లానింగ్ అనేది సంపన్నులకు మాత్రమే అని చాలా మంది భావిస్తారు. కానీ అది వాస్తవం కాదు. చాలామంది ఎస్టేట్ ప్లానింగ్ వాయిదా వేస్తుంటారు. మీరు ఆస్తులను కూడబెట్టుకోవడం ప్రారంభించిన వెంటనే ఎస్టేట్ ప్లానింగ్‌ను కూడా ప్రారంభించాలి. లబ్ధిదారుల జాబితా, ప్రతి ఒక్కరికీ కేటాయించాలనుకుంటున్న ఆస్తుల నిష్ఫత్తిని నిర్ణయించుకోవాలి. వీటి కోసం ఆర్థిక నిపుణుల సహకారం తీసుకోవడం కూడా మంచిదే.
ఇకపై అన్నింటీకీ ఒకే KYC - డాక్యుమెంట్ వెరిఫికేషన్ సో సింపుల్! - What Is Uniform KYC
రూ.6 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలా? టాప్-5 మోడల్స్ ఇవే! - Best Cars Under 6 Lakh