Love Story : ప్రేమ - దీనికి చిన్న, పెద్దా అనే తేడా తెలియదు. ధనికులు, పేదలు అనే బేధం ఉండదు. అందుకే ప్రతి ప్రేమ కథ ఎంతో మధురంగా ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన ప్రేమ కథే ఇది.
ఓపెన్ చేస్తే
అదొక పెద్ద ఆడిటోరియం. ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. ప్రేక్షకుల్లో నగరంలోని అత్యంత ధనవంతులు, వీఐపీలు కూడా ఉన్నారు. ఇంతలో ఒక అందమైన అమ్మాయి వచ్చి భరత నాట్యం చేయడం ప్రారంభించింది. ఆమె నృత్య ప్రదర్శన చూసిన ఓ పెద్దాయన మంత్ర ముగ్ధుడయ్యారు. ఈ అందాల రాశిని తన కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అతను ఇండియాలోని అత్యంత ధనవంతుడైన వ్యాపారి.
సీన్ కట్ చేస్తే
ట్రింగ్.. ట్రింగ్.. ఫోన్ మోగుతోంది. అమ్మాయి (భరత నాట్యం చేసిన అమ్మాయే) ఫోన్ లిఫ్ట్ చేసింది.
అమ్మాయి : హలో! ఎవరు మీరు?
ధీరూబాయి : నా పేరు ధీరూబాయి అంబానీ. నీకు తెలిసే ఉంటుంది. నీవు మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా?
అమ్మాయి :షాక్! (వెంటనే ఫోన్ పెట్టేసింది. ఎవరో తనను ఆట పట్టిస్తున్నారని అనుకుంది.)
ట్రింగ్.. ట్రింగ్.. మళ్లీ ఫోన్ మోగింది. ఈ సారి ఆ అమ్మాయి వాళ్ల నాన్న ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఎవరు మీరు? అని ప్రశ్నించారు.
ధీరూబాయి : నేను ధీరూబాయి అంబానీ. మీ అమ్మాయితో మాట్లాడదామని ఫోన్ చేశాను. మీకు అభ్యంతరం లేకపోతే ఆమెకు ఇస్తారా?
షాక్! ఫోన్ చేసింది ధీరూబాయి అని తెలియగానే ఆయన షాక్ అయ్యారు. వెంటనే తేరుకుని తన కుమార్తెకు ఫోన్ ఇచ్చారు. అప్పుడే ఆమెకు తెలిసింది. దేశంలోనే అత్యంత ధనవంతుడైన ధీరూబాయి అంబానీ స్వయంగా తనకు ఫోన్ చేశారని.
ధీరూబాయి : అమ్మాయీ! మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా?
అమ్మాయి :సిగ్గు పడుతూ...
మళ్లీ సీన్ కట్ చేస్తే
ముంబయిలో ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది. ఓ యువతీ, యువకుడు కారులో వెళ్తున్నారు. ఇంతలో ఆ యువకుడు సడెన్‌గా కారును ట్రాఫిక్ మధ్యలో ఆపేశాడు. అమ్మాయి వైపు తిరిగి "ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని ప్రపోజ్ చేశాడు. అంతే ఆమె షాకయ్యింది. ఏం చెప్పాలో తెలియక అలా ఉండిపోయింది. మళ్లీ ఆ యువకుడు 'నన్ను పెళ్లి చేసుకుంటావా? లేదా? ఇప్పుడే చెప్పు. నీవు చెప్పకపోతే నేను కారు తీయను' అన్నాడు.
బయట చూస్తే ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. కారు తీయమని అందరూ అరుస్తున్నారు. కానీ ఆ యువకుడు మాత్రం అవేవీ పట్టించుకోవడం లేదు. అమ్మాయి సమాధానం కోసం చూస్తున్నాడు.
అప్పుడు అమ్మాయి చాలా సిగ్గు పడుతూ,"ఐ లవ్ యూ టూ"అని తన మనస్సులోని మాటను చెప్పింది. ఈ విధంగా వారిద్దరూ ప్రేమబంధంతో ఒక్కటయ్యారు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఆదర్శవంతమైన కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు. ఇంతకూ ఆ ప్రేమ జంట ఎవరో తెలుసా? ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీ.
ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు ఇండియన్ రిచెస్ట్ మ్యాన్
ముకేశ్ అంబానీ 1957 ఏప్రిల్ 19న యెమెన్‌లో ధీరూబాయి అంబానీ, కోకిలా బెన్ అంబానీలకు జన్మించారు. ముకేశ్ తన తండ్రి దగ్గరే వ్యాపార మెలకువలు నేర్చుకున్నారు. తండ్రి మరణానంతరం పూర్తిగా వ్యాపారాన్ని తన చేతుల్లోకి తీసుకుని, దిగ్విజయంగా నడిపిస్తున్నారు. తన స్వయంకృషితో నేడు ఇండియాలోనే కాదు, ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారు.
నీతా అంబానీ, ముకేశ్ అంబానీ నృత్యకారిణిగా
నీతా దలాల్ ఓ మధ్య తరగతి గుజరాతీ కుటుంబంలో జన్మించారు. ఆమె కామర్స్‌లో బ్యాచులర్ డిగ్రీ చేశారు. ఆమెకు చిన్నప్పటి నుంచే భరతనాట్యం అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె ప్రొఫెషనల్ భరత నాట్యం డ్యాన్సర్‌గా ఎదిగారు. తరువాత ఆమె ఓ స్కూల్లో టీచర్‌గానూ పనిచేశారు. ముకేశ్‌తో మ్యారేజ్ ఫిక్స్ అయినప్పుడు, తను పెళ్లి అయినాక కూడా టీచర్‌గా కొనసాగుతానని షరతు పెట్టారు. అందుకు అంబానీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు.
ముచ్చటగా ముగ్గురు
ముకేశ్ అంబానీ, నితా అంబానీల వివాహం, పెద్దల సమక్షంలో 1985లో జరిగింది. వీరికి ఆకాశ్, ఇషా, అనంత్ అనే ముగ్గురు పిల్లలు పుట్టారు. అంతేకాదు వీరికి పృథ్వీ, వేదా, కృష్ణ, ఆదిత్య అనే నలుగురు మనవళ్లు కూడా ఉన్నారు.
కష్టమైనా, సుఖమైనా
Mukesh Ambani Love Story : ప్రతి మగవాని విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని అంటారు. ఇది ముకేశ్ అంబానీకి చక్కగా సరిపోతుంది. ముకేశ్ అంబానీ వ్యాపార వ్యవహారాల్లో ఎన్నో ఒడుదొడుకులు, కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. అయితే ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ నీతా అంబానీ ముకేశ్‌కు చేదోడు, వాదోడుగా నిలిచారు. ఈ విధంగా ముకేశ్ సాధించిన ప్రతి విజయం వెనుక నీతా అంబానీ ఉన్నారు. నలభై ఏళ్లుగా ఒకరికి ఒకరుగా జీవిస్తూ, నూతన వధూవరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
2026 నాటికి భారత్‌లో ఎయిర్‌ట్యాక్సీలు - ట్రాఫిక్ కష్టాలకు చెక్ - ఇకపై గాల్లోనే జర్నీ! - IndiGo Air Taxis
బేబీ మిలియనీర్ - 5 నెలల వయస్సులోనే రూ.4.2 కోట్ల సంపాదన - ఇంతకీ అతను ఎవరో తెలుసా? - Ekagrah Rohan Murty Networth