TRAI New Rules On SIM Swap : సిమ్ స్వాప్, రీప్లేస్‌మెంట్ మోసాలను అరికట్టడానికి ట్రాయ్ పలు కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ కొత్త రూల్స్ నేటి (జులై 1) నుంచే అమల్లోకి వచ్చాయి.
నిబంధనలను ఎందుకు మార్చారు?
టెక్నాలజీ పెరిగిన తరువాత కొంత మంది కేటుగాళ్లు, వ్యక్తుల సమాచారాన్ని తస్కరించి చేసి, వారి సిమ్‌కార్డులను పోర్ట్ చేయడం లాంటి మోసాలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇలాంటి మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల భద్రత కోసం, వారి సమాచారాన్ని సురక్షితంగా ఉంచడం కోసం ట్రాయ్ పలు కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ప్రక్రియ మరింత కఠినతరం కానుంది. దీనితో సిమ్ కార్డ్ మోసాలను చాలా వరకు అరికట్టవచ్చని ట్రాయ్ అధికారులు భావిస్తున్నారు.
కాస్త అసౌకర్యమే!
కొత్త నిబంధనల ప్రకారం, ఒక వినియోగదారుడు తన సిమ్‌ను పోర్ట్ చేయాలనుకుంటే, మొదటగా దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. ఆపై అతను కొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. తరువాత వినియోగదారులు తమ సమాచారాన్ని ధ్రువీకరించడానికి తమ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కొత్త పద్ధతి యూజర్లకు కొంత మేర అసౌకర్యాన్ని కలిగించవచ్చు. కానీ వారి భద్రతను దృష్టిలో ఉంచుకునే దీనిని అమలు చేస్తున్నట్లు ట్రాయ్ స్పష్టం చేసింది. మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, ఇకపై వినియోగదారులు తమ సిమ్ కార్డ్ భద్రత, వ్యక్తిగత సమాచారం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ట్రాయ్ సూచించింది.