Credit Card Rules Change In July 2024 :ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం క్రెడిట్ కార్డులు నిత్యావసరంగా మారాయి. నేటి కాలంలో ట్రాన్సాక్షన్స్ చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. అయితే ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు నిబంధనల్లో కొన్ని మార్పులు చేశాయి. రివార్డు పాయింట్లలో, వాటి ప్రయోజనాల్లో సవరణలు చేశాయి. జులై నెలలోనే ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, సిటీ బ్యాంక్‌లు తమ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో మార్పులు చేశాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్బీఐ కార్డ్ :క్రెడిట్ కార్డు రివార్డ్స్ పాయింట్లకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్బీఐ కొన్ని కీలక మార్పులు చేసింది. ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై రివార్డు పాయింట్ల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జులై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అలాగే జులై 15 నుంచి ప్రభుత్వ లావాదేవీల కోసం ఉపయోగించే 22 రకాల ఎస్బీఐ కార్డ్ క్రెడిట్ కార్డులపై రివార్డ్ పాయింట్లు వర్తించవని తెలిపింది.
ఐసీఐసీఐ బ్యాంక్ : ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల విషయంలో కీలక నిబంధనలు తీసుకొచ్చింది. క్రెడిట్ కార్డు రీప్లేస్మెంట్ ఛార్జీలను రూ.100 నుంచి రూ.200కు (ఎమరాల్డ్ కార్డు మినహా) పెంచింది. అదే సమయంలో చెక్/ క్యాష్ పికప్ ఫీజు, స్లిప్ రిక్వెస్ట్‌పై చెరో రూ.100, డయల్-ఏ-డ్రాఫ్ట్ లావాదేవీ ఛార్జీ, ఔట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజు, డూప్లికేట్ స్టేట్మెంట్ రిక్వెస్ట్ వంటి వాటిపై ఛార్జీలను తొలగించింది. జులై 1 నుంచి ఈ క్రెడిట్ కార్డు నిబంధనలు అమల్లోకి రానున్నాయి.